Lalu Yadav: సింగపూర్ సైనిక శిక్షణకు లాలూ ప్రసాద్ మనవడు

Lalu Yadav: సింగపూర్ సైనిక శిక్షణకు లాలూ ప్రసాద్ మనవడు
X
సింగపూర్‌ శిక్షణ కోసం వెళుతున్న రోహిణి ఆచార్య పెద్ద కొడుకు ఆదిత్య

బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మనవడు ఆదిత్య సింగపూర్ లో సైనిక శిక్షణకు వెళుతున్నాడు. రెండేళ్ల పాటు ఆయుధ శిక్షణతో పాటు యుద్ధ సన్నద్ధతకు సంబంధించిన ట్రైనింగ్ పొందనున్నాడు. ఈ విషయాన్ని ఆదిత్య తల్లి, లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య ఎక్స్ లో వెల్లడించారు. రోహిణి ఆచార్య కుటుంబం సింగపూర్ లో స్థిరపడిన విషయం తెలిసిందే.

రోహిణితో పాటు ఆమె కుటుంబంలో అందరికీ భారత పౌరసత్వమే ఉంది. అయితే, వారంతా సింగపూర్ లో పర్మనెంట్ రెసిడెన్సీ స్టేటస్ పొందారు. సింగపూర్ చట్టాల ప్రకారం.. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు రెండేళ్ల పాటు సైనిక శిక్షణ పొందాల్సి ఉంటుంది. సింగపూర్ పౌరులతో పాటు సింగపూర్ పర్మనెంట్ రెసిడెన్సీ పొందిన రెండో తరం పౌరులకు ఈ నిబంధన వర్తిస్తుంది.

ఆదిత్యకు ఇటీవలే 18 సంవత్సరాలు నిండడంతో సైనిక శిక్షణకు హాజరవుతున్నాడు. రెండేళ్ల పాటు సాగే ఈ శిక్షణలో ఫిజికల్ ట్రైనింగ్ తో పాటు వివిధ ఆయుధాల వినియోగంపై ప్రాథమిక శిక్షణ అందిస్తారు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న వారిని రిజర్వ్ దళాలుగా వ్యవహరిస్తారు. భవిష్యత్తులో యుద్ధం సంభవిస్తే ఈ రిజర్వ్ దళాల సేవలను ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది.

Tags

Next Story