Ajit Dival : రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమసిపోతే సంతోషమే

రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం సమసిపోతే అంతకంటే సంతోషం మరొకటి ఉండదని అన్నారు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి సౌదీ అరేబియాలో జరుగుతున్న రెండ్రోజుల సమావేశాల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సౌదీ అరేబియా వేదికగా రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశానికి సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షత వహించగా మొత్తం 40 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చించేందుకే వీరంతా సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి రష్యాను ఆహ్వానించలేదు.
ఈ సమావేశనికి భారత దేశం తరఫున అధికార ప్రతినిధిగా హాజరైన అజిత్ దోవల్ రెండు దేశాల మధ్య సంధిని కుదిర్చే విషయంలో తామెల్లప్పుడూ సిద్ధంగానే ఉంటామని తెలిపారు.భారతదేశం తరపున మేము తరచుగా రష్యా, ఉక్రెయిన్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేస్తూ సంధి కుదర్చడానికి తమవంతుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నామన్నారు. ఇప్పటికే యుద్ధాన్ని ఆపడానికి అనేక దేశాలు తమకు తోచిన ప్రతిపాదనలు తెరపైకి తీసుకు రాగా వాటిలో కొన్ని మాత్రమే రెండు దేశాలకూ ఆమోదయోగ్యమైనవి ఉన్నాయని అన్నారు. అలా కాకుండా రెండు దేశాలకూ సమ్మతమైన, శాశ్వతమైన, సమగ్ర పరిష్కారం కోసం భారతదేశం తీవ్రంగా ప్రయత్నిస్తోందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన అంతర్జాతీయ చట్టాల్లోని నియమ నిబంధనలను భారత్ గౌరవిస్తుందని దాని ప్రకారమే రెండు దేశాల మధ్య సంధి కుదిర్చే ప్రయాత్నం చేస్తామని.. అదే జరిగితే తమకంటే ఎక్కువగా సంతోషించేవారు ఎవ్వరూ ఉండరని అన్నారు.
అంతకుముందు జపాన్‌లో జరిగిన జీ7 సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జిలెన్‌స్కీని కలిసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దామని చెప్పిన విషయం తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com