Nuh Violence: నుహ్ మత ఘర్షణల నిందితుడు అరెస్ట్

గత నెలలో హరియాణాలోని నుహ్‌లో రేకెత్తిన మత ఘర్షణల కేసులో ముఖ్య నిందితుడు బజరంగ్‌దళ్‌కు చెందిన గో రక్షకుడు బిట్టూ బజరంగీని పోలీసులు అరెస్ట్ చేశారు. తావడూ పట్టణంలో భారీ చేజింగ్‌ల నడుమ అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సాధారణ దుస్తులు ధరించిన పోలీసులు, కర్రలు, తుపాకుల వంటి ఆయుధాలతో చాలాసేపు వెంబడించిన తర్వాత అతడిని పట్టుకోవడం ఈ వీడియో లో కనిపిస్తోంది.
నూహ్‌లో వీహెచ్‌పీ కార్యకర్తలు చేపట్టిన ఓ యాత్ర రణరంగంగా మారింది. ఆ ర్యాలీ నంద్ అనే గ్రామానికి చేరుకోగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ర్యాలీపైకి రాళ్లు రువ్వారు. ఈ యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వాహనాలకు నిప్పట్టించారు. తక్షణమే స్పందించిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయితే ఈ గొడవలకు రెచ్చగొట్టే ప్రసంగాలే కారణమని నిర్ధారించారు. బిట్టూ బజరంగీతోపాటు బజరంగ్‌దళ్ కార్యకర్త మోను మనేసర్ చేసిన కామెంట్ల కారణంగానే మతకలహాలు చెలరేగినట్టు అనుమానించారు. ఈ నేపథ్యంలో ఘర్షణలు జరిగిన 20 రోజుల తర్వాత ఫరీదాబాద్ సమీపంలో అతడిని అరెస్ట్ చేశారు.
బెదిరింపులు, అల్లర్లు, హింస, ప్రభుత్వ పనులను అడ్డుకోవడం, మారణాయుధంతో హాని కలిగించడం, ప్రభుత్వ అధికారిని విధుల నుంచి తప్పించడం వంటి అభియోగాలు ఇతనిపై ఉన్నాయి. వీటితో పాటుసాదర్ పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ ఉషా కుందు ఫిర్యాదు ఆధారంగా దాఖలైన 15 నుంచి 20 కేసుల్లోనూ బజరంగీ అలియాస్ రాజ్‌కుమార్‌ను ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని తావడూ పట్టణంలోని నేర దర్యాప్తు విభాగం అదుపులోకి తీసుకోగా అతనిని ఫరీదాబాద్‌కు తరలించామని తెలిపారు. అలాగే వీడియోలు ఆధారంగా అతడి అనుచరులను గుర్తించే పనిలో ఉన్నట్టు చెప్పారు. బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్ర సందర్భంగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయిన 'తుమ్హరా జీజా ఆ రహా హై' అనే రెచ్చగొట్టే ఫేస్ బుక్ వీడియోను పోస్ట్ చేసాడు.
గోరక్షక నాయకుడు మోహిత్ యాదవ్ అలియాస్ మోను ఉండటాన్ని ప్రస్తావిస్తూ ఎంతో ఆవేశంగా బిట్టు బజరంగి ఈ ప్రసంగం చేశారు. దీని వల్ల ప్రతీకార వీడియోలు, పోస్టులు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. తరువాత అది మత ఉద్రిక్తతలకు కారణం అయ్యింది. ఫిబ్రవరిలో హర్యానాలోని భివానీలో ఎస్ యూవీలో నాసిర్, జునైద్ అనే ఇద్దరు వ్యక్తుల హత్య కేసులో మోను నిందితుడిగా ఉన్నాడు. అతడిని ఇంకా అరెస్టు చేయలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com