Panneerselvam: డీఎంకేలో చేరిన మాజీ సీఎం పన్నీర్ సెల్వం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ, రాష్ట్ర రాజకీయాల్లో కనీవినీ ఎరుగని భారీ మార్పు చోటుచేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత నమ్మకస్తుడు, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏఐఏడీఎంకే మాజీ నేత పన్నీర్‌సెల్వం అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (DMK)లో చేరారు. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ ఉదయం చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం 'అన్న అరివాలయం' ఒక్కసారిగా సందడిగా మారింది. కొన్ని రోజులుగా జరుగుతున్న ఊహాగానాలకు బలం చేకూరుస్తూ, పన్నీర్ సెల్వం తన కుమారుడు రవీంద్రన్‌తో కలిసి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. స్వయంగా సీఎం స్టాలిన్ ఆయనకు ఆహ్వానం పలికారు. పార్టీ కండువా కప్పి డీఎంకేలోకి సాదరంగా ఆహ్వానించారు.
డీఎంకేలో చేరిన అనంతరం పన్నీర్ సెల్వం భావోద్వేగంగా మాట్లాడారు. డీఎంకేను 'తల్లిలాంటి పార్టీ'గా అభివర్ణించారు. "అరిగ్నర్ అన్నా, కలైంజ్ఞర్ కరుణానిధి నిర్దేశించిన మార్గంలో పయనిస్తూ స్టాలిన్ అద్భుతమైన పాలన అందిస్తున్నారు. గత ఐదేళ్లలో ఆయన అందించిన అభివృద్ధిని చూసి దేశమంతా ఆశ్చర్యపోతోంది. అందుకే వారి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నాను" అని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, జయలలితకు అత్యంత నమ్మకస్తుడిగా ముద్రపడ్డ నేత, దశాబ్దాల రాజకీయ ప్రత్యర్థి పార్టీలో చేరడం ఏఐఏడీఎంకే శ్రేణులకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇది ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
