Bihar: రాత్రికి రాత్రే నీళ్లు ఉన్న చెరువును మాయం

Bihar: రాత్రికి రాత్రే నీళ్లు ఉన్న చెరువును మాయం
బీహార్‌లో కబ్జాదారుల మాయాజాలం

కబ్జాదారులు రాత్రికి రాత్రే ఏకంగా ఒక చెరువును మాయం చేసిన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. దర్భాంగ జిల్లాలో నీటి వనరులతో ఉన్న ఒక ప్రభుత్వ చెరువును కొందరు కబ్జాదారులు రాత్రికి రాత్రే ఖాళీ చేసి దానిని ఇసుకతో పూడ్చేసి చదును చేసి అక్కడొక గుడిసెను నిర్మించారు. ఇప్పుడు ఆ ప్రదేశాన్ని చూసిన వారెవరైనా అంతకుముందు అక్కడొక చెరువు ఉండేదంటే నమ్మలేని విధంగా కబ్జాదారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు.

బిహార్‌లో జరిగే దొంగతనాల గురించి మనం ఎన్నో కథలు కథలుగా విన్నాం. 60 అడుగుల పొడవైన ఇనుప బ్రిడ్జిని, రైలు ఇంజిన్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు.. తాజాగా ఏకంగా ఓ చెరువునే మాయం చేశారు. అప్పటివరకు నీళ్లతో ఉన్న ఆ చెరువు తెల్లారే సరికే కనిపించకుండా పోయింది. బిహార్‌లో జరిగిన ఈ చోరీ వినడానికే ఆశ్చర్యంగా ఉంది. గతంలో బిహార్‌లో ఇను బ్రిడ్జిని, రోడ్డును, రైలు ఇంజిన్‌నే ఎత్తుకెళ్లిన ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారగా.. తాజాగా ఓ చెరువునే రాత్రికి రాత్రే మాయం చేసి.. అక్కడ ఓ గుడిసెను వేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

దర్బంగా జిల్లాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పటివరకు అక్కడ నీటితో కనిపించిన చెరువు తెల్లారేసరికే.. మట్టితో కప్పేసి అక్కడ ఒక ఇల్లు ప్రత్యక్షం అయింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకుని అవాక్కయ్యారు. అయితే అది ఆక్రమించింది ఎవరు అనేది మాత్రం ఇంకా తేలకపోవడం గమనార్హం.


అయితే గత 10, 15 రోజుల నుంచి రోజూ రాత్రిపూట ట్రక్కులు నడిచేవని స్థానికులు చెప్పారు. ట్రక్కులతోపాటు ప్రొక్లెయినర్లు, ఇతర భారీ యంత్రాలు ఆ చెరువు వద్ద పనులు సాగించినట్లు పోలీసులకు తెలిపారు. అయితే అక్కడ ఏం జరిగిందనేది మాత్రం తమకు తెలియదని పేర్కొన్నారు. తీరా అక్కడికి వెళ్లి చూడగా.. నీళ్లు ఉన్న చెరువు స్థానంలో మొత్తం మట్టితో నింపేసి.. అక్కడ ఒక గుడిసె వేసినట్లు గుర్తించారు. అయితే ఈ పని అంతా కేవలం రాత్రి పూట మాత్రమే జరిగిందని స్థానికులు చెప్పినట్లు డీఎస్పీ కుమార్ తెలిపారు.

ఈ చెరువును చేపల పెంపకానికి, వ్యవసాయానికి నీళ్లు అందించేందుకు ఉపయోగించేవారని స్థానికులు వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ చెరువు ఉన్న ఆనవాళ్లు ఏమీ లేవని డీఎస్పీ కుమార్ తెలిపారు. అయితే ఆ చెరువును ఎవరు కబ్జా చేశారు.. ఆ మట్టిని ఎవరు ఎందుకు నింపారు అనే విషయాలు మాత్రం తెలియరాలేదని డీఎస్పీ పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story