Odisha: రోగం పోవాలని పసివాడికి 40 వాతలు

ఏఐతో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్న వేళ కొంతమంది ప్రజలు మూఢనమ్మకాలనే విశ్వసిస్తున్నారు. అనారోగ్యానికి గురైనా, ఆపదలు వచ్చినా ఎవరో తమకు బాణామతి చేశారని అందుకే ఇలా అయ్యిందని ఆందోళన చెందుతున్నారు. మూఢనమ్మకాలపై ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో అడ్డుకట్టపడడం లేదు. తాజాగా ఒడిషాలో దారుణ ఘటన వెలుగుచూసింది. నెల రోజుల వయసున్న శిశువు అనారోగ్యానికి గురికాగా.. జబ్బు నయం కావడానికి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సింది పోయి ఒంటిపై ఇనుపరాడ్డుతో వాతలు పెట్టారు. ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
అనారోగ్యానికి గురైన శిశువు ఒంటిపై 40 వాతలు పెట్టారు. దీంతో పుక్కుపచ్చలారని ఆ శిశువు ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సమీప ఆస్పత్రికి తరలించారు. పూర్తివివరాల్లోకి వెళ్తే.. నబరంగ్ పూర్ జిల్లాలోని చందహండి బ్లాక్ లోని ఫండల్ పాడ గ్రామంలో నెల వయసున్న శిశువు తీవ్ర జ్వరానికి గురైంది. అదేపనిగా గుక్కపెట్టి ఏడుస్తుంటే ఏదో దుష్ట శక్తి ఆవహించిందని కుటుంబ సభ్యులు భావించారు. మూఢనమ్మకాలను నమ్మే ఆ కుటుంబం వ్యాధి నయం కావడానికి ఇనుపరాడ్ ను కాల్చి ఒంటిపై 40 వాతలు పెట్టారు. కడుపు, తలపై వాతలు పెట్టారు. దీంతో శిశువు ఆరోగ్యం మరింత క్షీణించింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు.
శిశువుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శిశువు ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. నబరంగ్ పూర్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో మూఢనమ్మకాలు పెచ్చుమీరుతున్నాయని అన్నారు. అనారోగ్యానికి గురైన పిల్లలకు మూఢనమ్మకాల పేరిట వైద్యం చేయకుండా ఆసుపత్రులకు తీసుకెళ్లాలని సూచించారు. మూఢనమ్మకాలపై ఆరోగ్యశాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆయన తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com