Odisha Elections: ఒడిసాలో బిజు జనతా దళ్ ఒంటరి పోరు

ఒడిశాలో అప్రతిహతంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతా దళ్ మరోసారి అధికారమే లక్ష్యంగా ఎన్నికల సమరంలోకి దూకింది. ప్రతిపక్ష భాజపా కూడా ఈసారి సత్తా చాటాలని చూస్తోంది. శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరగనుండడంతో మోదీ మానియాతో అధికారాన్ని కైవసం చేసుకోవాలని ప్రణాళిక రచిస్తోంది. భాజపా-BJD పొత్తు ఉంటుందని ప్రచారం జరిగినా అదేమీ లేదని స్పష్టం కావడంతో ఒంటరిపోరుకు సిద్ధమైన రెండు పార్టీలు వ్యూహ, ప్రతి వ్యూహాలతో సిద్ధమయ్యాయి. ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపాలని పట్టుదలతో ఉంది.
ఒడిశా లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు పార్టీలన్నీ వ్యూహ రచనలో మునిగిపోయాయి. అభివృద్ధే నినాదంగా అధికార బిజూ జనతా దళ్.. అవినీతి, నిరుద్యోగమే నినాదంగా ప్రతిపక్షాలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. పొత్తు పొడవకపోవడంతో భారతీయ జనతా పార్టీ కూడా ప్రచార జోరు పెంచింది. సంస్థాగతంగా ఇంకా పటిష్టంగానే కనిపిస్తున్న కాంగ్రెస్ కూడా ఈసారి సత్తా చాటి పూర్వ వైభవాన్ని చాటాలని సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతా దళ్ రెండు దశాబ్దాలకుపైగా ఒడిశాలో బలమైన కోటను నిర్మించుకుంది. ఈ కోటను బద్దలు కొట్టి అధికారాన్ని కైవసం చేసుకోవడం ప్రతిపక్షాలకు కష్టమైన పనే. గతంలో బిజూ జనతా దళ్‌కు మిత్రపక్షంగా ఉన్న భాజపా...ఇప్పుడు ప్రతిపక్షంగా బరిలో నిలిచింది. మూడోస్థానంలో ఉన్న కాంగ్రెస్ నుంచి కూడా సీఎం నవీన్ పట్నాయక్‌కు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒడిశాలో 21 లోక్‌సభ స్థానాలు, 147 శాసనసభ స్థానాలకు నాలుగు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13, 20, 25, జూన్ 1 తేదీల్లో పోలింగ్ జరగనుంది.
నిరుద్యోగం, అవినీతి, శాంతిభద్రతలు, వరి సేకరణలో అక్రమాలు, చిట్ ఫండ్, మైనింగ్ స్కామ్..వంటివి ఒడిశా ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించనున్నాయి. సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని అధికార బిజూ జనతాదళ్ ఇప్పటికే 24 ఏళ్లుగా అధికారంలో ఉంది. గత ఐదేళ్లలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని పార్టీ... కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది. అభివృద్ధి ప్రాజెక్టుల్లో ఒడిశాకు మోదీ సర్కార్ నుంచి మద్దతు లభిస్తోందని అందుకే కేంద్రానికి అండగా నిలుస్తున్నామని బిజు జనతా దళ్ పార్టీ పార్లమెంటు వేదికగా ప్రకటించింది. ఈ ప్రకటనతో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని విమర్శించే ప్రధాన అస్త్రాన్ని నవీన్ పట్నాయక్ పార్టీ కోల్పోయింది. ఒడిశాలో పరిపాలన అంతా ఒడిశా యేతర అధికారులే నడిపిస్తున్నారన్న ఆరోపణ నవీన్ పట్నాయక్ ప్రభుత్వంపై ఉంది. నవీన్ పట్నాయక్ ఎక్కువగా ఒడియా యేతర అధికారులపై ఆధారపడటాన్ని అస్త్రంగా చేసుకుని ఎన్నికలకు వెళతామని ప్రతిపక్ష భాజపా ఇప్పటికే ప్రకటించింది.
24 ఏళ్ల పాలనలో నిరుద్యోగం, వలసలు పెరగడం అధికార బిజు జనతా దళ్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. నవీన్ పట్నాయక్ 24 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించినా ఒడిశా నుంచి యువకుల వలసలను అరికట్టడంలో విఫలమయ్యారని భాజపా ఆరోపిస్తోంది. ఉద్యోగాల కల్పనలోనూ ప్రభుత్వం విఫలమైందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com