Menstrual Leave: మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. ఎక్కడంటే

Menstrual Leave: మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. ఎక్కడంటే
X
ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం

స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఒడిశా ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. ఉద్యోగినుల కోసం ఒక రోజు నెలసరి సెలవు పాలసీని ప్రవేశపెడుతున్నట్లు గురువారం ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల కు ఇది వర్తిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు కటక్‌లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పార్వతి పరీదా ఈ కీలక ప్రకటన చేశారు. ఈ పాలసీ తక్షణమే అమల్లోకి వస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. మహిళా ఉద్యోగులు ప్రతినెలా తమ రుతుక్రమంలో తొలి లేదా రెండో రోజు ఈ సెలవు ను తీసుకునేలా దీన్ని రూపొందించినట్లు తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సును కాంక్షిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఒడిశా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేసే మహిళలు తమ నెలసరి సమయంలో మొదటి లేదా రెండో రోజు.. ఈ సెలవును ఉపయోగించుకోవచ్చని ఒడిశా ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళా ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉపముఖ్యమంత్రి పార్వతీ పరీదా తెలిపారు. మరోవైపు ప్రస్తుతం బిహార్, కేరళ ప్రభుత్వాలు మాత్రమే మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు ఇస్తున్నాయి. 1992లోనే బిహార్ ఈ నెలసరి సెలవుల విధానాన్ని తీసుకువచ్చింది. అక్కడ ప్రస్తుతం ప్రతి నెలా రెండు రోజులు మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు ఇస్తున్నారు. ఇక గతేడాది కేరళ ప్రభుత్వం విద్యార్థినులను నెలసరి సెలవులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థినులకు నెలసరి సెలవులు ఇస్తోంది.

ఇక జొమాటో వంటి ప్రైవేట్ సంస్థల్లోనూ మహిళలకు ఇలా సెలవులు ఇస్తున్నారు. ఏడాదికి పది పెయిడ్ పీరియడ్ లీవ్స్‌లను జొమాటో 2020 నుంచి అమలు చేస్తోంది. అయితే దేశవ్యాప్తంగా నెలసరి సెలవులకు సంబంధించి ఎలాంటి చట్టం లేదు.మహిళలకు నెలసరి సెలవులకు సంబంధించి 2022లోనే కేంద్రం ఓ బిల్లు తీసుకువచ్చింది. అయితే ఆ బిల్లు ఇప్పటికీ ఆమోదం పొందలేదు. ఈ పరిస్థితుల్లో ఒడిశా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు సరైన బహుమతి ఇచ్చారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Tags

Next Story