Odisha HC : రోజూ దేవుడ్ని ప్రార్థిస్తున్నాడని మరణశిక్షను జీవితఖైదుగా మార్చిన హైకోర్టు

Odisha HC : రోజూ దేవుడ్ని ప్రార్థిస్తున్నాడని మరణశిక్షను జీవితఖైదుగా మార్చిన హైకోర్టు
X
ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు

ఒడిశా హైకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో దోషిగా తేలిన ఎస్‌కే ఆసిఫ్ అలీకి ఒడిశాలోని జగత్‌సింగ్‌పుర్‌లో ఉన్న పోక్సో కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. దీనికి సంబంధించి జూన్ 27న 106 పేజీల సుదీర్ఘ తీర్పును ఒడిశా హైకోర్టు ఇచ్చింది. ఈ తీర్పు ఇచ్చే క్రమంలో హైకోర్టు బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది.

"ఈ కేసులో దోషిగా తేలిన ఆసిఫ్ అలీ రోజూ దేవుడ్ని ప్రార్థిస్తున్నాడు. అతడు దేవుడి ముందు లొంగిపోయాడు. తాను చేసిన నేరాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అతడికి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తున్నాం" అని తీర్పు ఇచ్చే సందర్బంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేరంలో పాత్ర ఉన్నట్టుగా తగిన ఆధారాలు లేనందున మరో నిందితుడు ఎస్‌కే అఖీల్ అలీని నిర్దోషిగా విడుదల చేసింది. బాధిత బాలిక కుటుంబానికి రూ.1.50 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని పోక్సో కోర్టు ఆదేశించగా.. దాన్ని కూడా హైకోర్టు సవరించింది. బాధిత బాలిక కుటుంబానికి రూ.10 లక్షల పరిహారాన్ని అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

2014 సంవత్సరం ఆగస్ట్ 21న ఒడిశాలోని జగత్‌సింగ్‌పుర్ జిల్లాలో ఉన్న తిర్టోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మారుమూల గ్రామంలో దారుణం జరిగింది. దుకాణం నుంచి చాక్లెట్లు కొనుక్కొని, ఇంటికి తిరిగి వస్తున్న ఓ ఆరేళ్ల బాలిక కిడ్నాప్‌నకు గురైంది. ఎస్‌కే అఖీల్ అలీ (38), ఎస్‌కే ఆసిఫ్ అలీ (37) అనే ఇద్దరు వ్యక్తులు ఆ పాపను కిడ్నాప్ చేశారు. ఆమెను ఓ పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాలిక బయటికి వెళితే, ఊరి ప్రజల నడుమ తమ నిజ స్వరూపం బయటపడుతుందని అఖీల్ అలీ, ఆసిఫ్ అలీ భయపడ్డారు. దీంతో వీరిద్దరూ కలిసి ఆరేళ్ల బాలికను చంపేశారు. ఈ కేసును తొలుత విచారించిన జగత్‌సింగ్‌పుర్‌లో ఉన్న పోక్సో కోర్టు 2022 నవంబర్ 21న సంచలన తీర్పు ఇచ్చింది. బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు జీవితఖైదు శిక్షను, హత్య చేసినందుకు మరణశిక్షను అఖీల్ అలీ, ఆసిఫ్ అలీకి విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు ఇచ్చింది.

Tags

Next Story