West Bengal: బెంగాల్ లో మరో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

ఆర్జీ కర్ వైద్య కళాశాల ఘటన మరువకముందే, పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ బర్ధమాన్ జిల్లా దుర్గాపూర్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న ఒడిశాకు చెందిన విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ అమానవీయ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒడిశాలోని జలేశ్వర్‌కు చెందిన బాధితురాలు శుక్రవారం రాత్రి 8:30 గంటల సమయంలో తన క్లాస్‌మేట్‌తో కలిసి భోజనం కోసం కాలేజీ ప్రాంగణం నుంచి బయటకు వచ్చింది. ఆ సమయంలో కొందరు దుండగులు వారిని అడ్డగించి వేధించడం మొదలుపెట్టారు. భయంతో ఆమె స్నేహితుడు అక్కడి నుంచి పారిపోగా, ఒంటరిగా చిక్కిన యువతిని సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారని అసన్సోల్-దుర్గాపూర్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. అనంతరం నిందితులు ఆమె ఫోన్‌ను కూడా లాక్కుని పరారయ్యారు.
ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. “ఇక్కడ మా కుమార్తె చదువును కొనసాగించబోము. తనని ఇంటికి తీసుకెళ్లిపోతాం” అని ఆమె తల్లిదండ్రులు మీడియాతో అన్నారు.
ఈ ఘటనపై స్థానిక బీజేపీ నాయకత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. గతంలో సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య కేసు తరహాలోనే ఈ కేసు వివరాలను కూడా కప్పిపుచ్చే ప్రయత్నం జరగకూడదని వారు డిమాండ్ చేశారు.
జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) సభ్యురాలు అర్చనా మజుందార్ కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నిందితులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించకపోవడం వల్లే అత్యాచారాలు, లైంగిక దాడులు పెరుగుతున్నాయి. బెంగాల్‌లో ఏ ఒక్క రేపిస్టుకు ఉరిశిక్ష పడినట్లు మేము చూడలేదు” అని ఆమె వ్యాఖ్యానించారు. న్యాయం ఆలస్యం కావడం వల్లే నేరస్థులకు భయం లేకుండా పోతోందని ఆమె అభిప్రాయపడ్డారు. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com