IMD warning: ఒడిశాకు భారీ వర్ష సూచన, గుజరాత్‌లోని వల్సాద్ పట్టణంలో కూడా
రాగల మూడు రోజులపాటు ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రంవెల్లడించింది. దక్షిణ ఉత్తరప్రదేశ్ నుంచి బంగాళాఖాతం వరకు ఆవరించి ఉన్న ఉపరితల ద్రోణి కారణంగా ఒడిశాలో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈ మేరకు ఒడిశాలోని ఉత్తరాది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీచేసింది.
‘దక్షిణ ఉత్తరప్రదేశ్ నుంచి బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల పైన ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. ఈ ద్రోణి పరభావంతో రాష్ట్రంలో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉంది.’ అని ఐఎండీ భువనేశ్వర్ విభాగం డైరెక్టర్ మనోరమ మొహంతి అన్నారు. గడిచిన 24 గంటల్లో బమ్రా, సంబాల్‌పూర్ సహా ఆరు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిశాయని పేర్కొంది.
మరోవైపు గుజరాత్‌లోని వల్సాద్ పట్టణంలో ఎన్నడూ ఊహించని విధంగా కుంభవృష్టి కురిసింది. రాత్రికి రాత్రే భారీ వర్షం కురవడంతో పట్ణణంలోని కశ్మీర్ నగర్ ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. ఎక్కడికక్కడ వరదనీరు నిలిచిపోయింది. జనజీవనం స్తంభించిపోయింది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగింది. ఆ ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
‘వల్సాద్‌లో గత రాత్రి నుంచి 120 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దాంతో వల్సాద్‌లోని కశ్మీర్ నగర్‌లో భారీగా వరద నీరు చేరింది. నివాసాలు నీట మునిగాయి. దాంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాం. దాదాపు 100 కుటుంబాలను కశ్మీర్ నగర్ నుంచి వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేశాం.’ అని వల్సాద్ సబ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆస్థా సోలంకీ చెప్పారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com