Coromandel Express Accident: వేగంగా పూర్తైన పునరుద్ధరణ

ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాద స్థలంలో రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. రైల్వేశాఖ ఆధ్వర్యంలో ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ దగ్గరుండి ట్రాక్ పునరుద్ధరణ పనులను పర్యవేక్షించారు. రూట్ క్లియర్ చేయడంతో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. సుమారు వెయ్యి మంది రైల్వే కార్మికులు, అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఏడు పాకెటింగ్ యంత్రాలు, భారీ రైల్వే క్రేన్, నాలుగు రోడ్ క్రేన్లను ఉపయోగించారు.
భారీ జనరేటర్లు, పెద్ద లైట్లను ఉపయోగించి ట్రాక్ లింకింగ్ పనులు చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో భారీగా లౌడ్‌స్పీకర్లు ఏర్పాటు చేసి స్థానికులు అటువైపు రాకుండా కట్టుదిట్టం చేశారు. దీంతో పాటు రైల్వే పోలీసులను ప్రమాద ప్రాంతంలో మోహరించారు. ప్రమాదానికి గురైన 21 బోగీలను పట్టాలపై నుంచి తొలగించారు. గూడ్స్ రైలు బోగీలపైకి ఎక్కిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌ను తొలగించారు. డౌన్మెయిల్ లైన్‌ను పనులు పూర్తయ్యాయని.. ఓవర్ హెడ్ వైరింగ్ పనులు కొనసాగుతున్నాయని అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. కొన్ని గంటల్లో మరి కొన్ని రైళ్లు నడవనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com