OLA: మహిళపై క్యాబ్ డ్రైవర్‌కు వేధింపులు.. ఓలాకు భారీ ఫైన్

OLA: మహిళపై క్యాబ్ డ్రైవర్‌కు వేధింపులు.. ఓలాకు భారీ ఫైన్
మ‌హిళ‌కు క‌నిపించేలా త‌న మొబైల్‌లో నీలి చిత్రాలు చూసిన డ్రైవ‌ర్‌

మ‌హిళ‌పై ఓలా క్యాబ్ డ్రైవ‌ర్ వేధింపుల‌కు పాల్ప‌డిన కేసులో క‌ర్ణాట‌క హైకోర్టు సంస్థ‌కు రూ. 5ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. వివ‌రాల్లోకి వెళితే.. 2018 ఆగ‌స్టులో ఓ మ‌హిళ తాను వెళ్లాల్సిన చోటుకు ఓలా క్యాబ్ బుక్ చేసుకుంది. అందులో వ‌చ్చిన క్యాబ్ డ్రైవ‌ర్ ప్ర‌యాణ స‌మ‌యంలో ఆమెతో అనుచితంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు ప్ర‌యాణికురాలు ఆరోపించింది.

బ్యాక్ వ్యూ మిర్ర‌ర్‌లో మ‌హిళ‌కు క‌నిపించేలా త‌న మొబైల్‌లో నీలి చిత్రాలు చూశాడు. అంత‌టితో ఆగ‌కుండా ఆమె ముందే అస‌భ్య‌క‌ర చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డాడు. దాంతో అత‌ని ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌క‌ ఆమె త‌న గ‌మ్య‌స్థానానికి ముందే దిగిపోవాల‌ని ప్ర‌య‌త్నించింది. డ్రైవ‌ర్‌ను కారు ఆపాల‌ని కోరింది. దానికి అత‌డు నిరాక‌రించిన‌ట్లు మ‌హిళ పేర్కొంది.

ఈ విష‌యమై ఓలాకు ఫిర్యాదు చేసింది. దాంతో డ్రైవ‌ర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టామ‌ని చెప్పిన సంస్థ త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేర‌కు పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై పోష్ చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు.

ఇక ఈ కేసులో విచారణ జ‌ర‌పాల‌ని కంపెనీ అంత‌ర్గ‌త ఫిర్యాదుల క‌మిటీని జ‌స్టిస్ ఎంజీఎస్ క‌మ‌ల్ ఆదేశించారు. 90 రోజుల్లోగా కోర్టు ముందు నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీనిపై స్పందించిన ఓలా కంపెనీ డ్రైవ‌ర్లు సంస్థ ఉద్యోగులు కాద‌ని, అందుకే పోష్ చ‌ట్టంలోని నిబంధ‌న‌ల ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి అనుకూలం కాదంటూ ఐసీసీ ద్వారా తెలియ‌జేసింది.

దాంతో ఐసీసీ నివేదిక‌పై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు ఓలా సంస్థ యాప్ డౌన్‌లోడ్ చేసే స‌మ‌యంలో క‌స్ట‌మ‌ర్ల‌కు భ‌ద్ర‌త‌, ర‌క్ష‌ణ ఒప్పంద హామీలు ఇవ్వ‌డాన్ని గుర్తు చేసింది. ఈ ఒప్పంద హ‌క్కుల‌ను ఉల్లంఘించినందుకు గాను బాధితురాలికి త‌గిన ప‌రిహారం చెల్లించాల‌ని పేర్కొంది.

ఇందులో భాగంగా మ‌హిళ‌కు రూ. 5ల‌క్ష‌లు ప‌రిహారంగా ఇవ్వాల‌ని ఓలా మాతృ సంస్థ ఏఎన్ఐ టెక్నాల‌జీస్‌ను ఆదేశించింది. దీంతో పాటు పిటిష‌న‌ర్‌కు మ‌రో రూ.50వేలు చెల్లించాల‌ని జ‌స్టిస్ ఎంజీఎస్ క‌మ‌ల్ తీర్పును వెల్ల‌డించారు.

Tags

Next Story