Jammu Kashmir: నేడు పహల్గామ్‌లో కేబినెట్ భేటీ.. దేనికోసమంటే..!

జమ్మూకాశ్మీర్‌లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పదవీ కాలంలో సాధారణంగా వేసవి రాజధాని శ్రీనగర్ ఉంటుంది. ఇక శీతాకాల రాజధాని జమ్మూ ఉంటుంది. కానీ ఈసారి ఈ రెండింటికి భిన్నంగా తొలిసారి పహల్గామ్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పర్యాటక రంగం కుదేలైంది. ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. అప్పటి నుంచి పర్యాటకులు తగ్గిపోవడంతో బిజినెస్ పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదం, హింసకు వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చేందుకు ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం మంగళవారం పహల్గామ్‌లో కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయం తీసకుంది. ఈ భేటీ ద్వారా పర్యాటకులకు, స్థానికులకు ఒక సంఘీభావంగా ఉంటుందని భావిస్తోంది.
ఇక ఈ కేబినెట్ సమావేశం యొక్క ముఖ్య అజెండా ఇంకా బహిరంగంగా ప్రకటించనప్పటికీ.. జమ్మూకాశ్మీర్‌లో హింసకు చోటు లేదని.. దేశ వ్యతిరేకులకు, సామాజిక వ్యతిరేకులకు ఒక సందేశాన్ని ఇచ్చేందుకే ఈ కేబినెట్ భేటీ జరుగుతోందని అధికారులు చెబుతున్నారు.
ఒమర్ అబ్దుల్లా తొలిసారి జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా 2009-14 వరకు పని చేసిన సమయంలో ఉత్తర కాశ్మీర్‌లోని గురేజ్, మాచిల్, తంగ్‌ధర్, జమ్మూ ప్రాంతంలోని రాజౌరి, పూంచ్ ప్రాంతాల్లో మంత్రివర్గ సమావేశాలు నిర్వహించారు. అయితే ఇటీవల ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అబ్దు్ల్లా మాట్లాడుతూ.. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగిస్తామని హామీ ఇచ్చారు. భద్రత, ప్రజల్లో విశ్వాసాన్ని నింపుతామని.. పర్యాటక రంగాన్ని మళ్లీ పునరుద్ధరణకు మార్గం సుగమం చేస్తామని.. తిరిగి సాధారణ స్థితికి పరిస్థితులు వచ్చేలా కృష్టి చేస్తానని అబ్దుల్లా ప్రతిజ్ఞ చేశారు. ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా పహల్గామ్‌లో కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇక ఏప్రిల్ 28న జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయింది. ఈ సమావేశంలో పహల్గామ్ దాడికి వ్యతిరేకంగా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మత సామరస్యాన్ని దెబ్బ తీసే కుట్రలను ఎదుర్కొంటామని అబ్దుల్లా ప్రకటించారు. పౌరులందరికీ శాంతి, అభివృద్ధి, సమగ్ర శ్రేయస్సు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com