Omar Abdullah: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి తీర్మానం ఎంతంటే .. ఒమర్ అబ్దుల్లా

జమ్మూకశ్మీర్‌లో తమ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి తీర్మానాన్ని ప్రవేశపెడతామని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ విజయం తర్వాత ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు స్వీకరించనున్నారని ఆ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్సీ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్ర హోదా ఇవ్వాలనే తీర్మానాన్ని ప్రధాని మోడీకి సమర్పిస్తామన్నారు. నియోజక వర్గాల పునర్విభజన, ఎన్నికలు, రాష్ట్ర హోదా లాంటి వాటి మీద తీర్మానం చేస్తామన్నారు. కొందరు నేతలు జమ్మూకశ్మీర్‌ను ఢిల్లీతో పోల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్‌ను ఢిల్లీతో పోల్చవొద్దన్నారు. ఎందుకంటే దేశ రాజధానికి రాష్ట్ర హోదా ఇస్తామని ఎవరూ చెప్పలేదు.. కానీ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ప్రధాని, హోంమంత్రి, కేంద్రమంత్రులు చెప్పారని ఒమర్ అబ్దుల్ పేర్కొన్నారు.
ఇక, 2019 వరకు జమ్మూకశ్మీర్ రాష్ట్రంగానే ఉందన్న విషయాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా గుర్తు చేశారు. కశ్మీర్‌లో శాంతితో పాటు అభివృద్ధికి బాటలు వేయడం కోసం రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కశ్మీర్‌లో ఉన్న రాజకీయ పార్టీలను బీజేపీ లక్ష్యంగా చేసుకొని.. బలహీనపర్చేందుకు ట్రై చేస్తుందని దుయ్యబట్టారు. కానీ, ఆ పార్టీ కుట్రలు ఇక్కడ ఫలించలేదన్నారు. సీఎంగా పేరును తన తండ్రి ప్రకటించడంపై ఒమర్ అబ్దుల్లా రియాక్ట్ అవుతూ.. నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభా పక్ష సమావేశం తర్వాత మిత్రపక్షాలతో చర్చలు జరిపి ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com