Jamili Election Bill: జమిలికి తొలి అడుగు

లోక్‌సభతో పాటు అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే దిశగా కీలక అడుగు పడింది. జమిలి ఎన్నికలకు వీలు కల్పించే రెండు బిల్లులను మంగళవారం కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అంతకుముందు బిల్లులు ప్రవేశపెట్టడంపై 90 నిమిషాల పాటు సభలో చర్చ జరిగింది. జమిలి బిల్లులను ప్రవేశపెట్టడం కోసం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఇచ్చిన తీర్మానంపై స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించగా 269 మంది జమిలి బిల్లులకు మద్దతునిచ్చారు. 198 మంది వ్యతిరేకించారు. దీంతో అర్జున్‌రామ్ మేఘ్వాల్ సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టారు. ఇందులో ఒకటి రాజ్యాంగ(129వ సవరణ) బిల్లు కాగా, మరొకటి కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లు. ఈ బిల్లులను జేపీసీకి పంపుతూ బుధవారం తీర్మానం చేసే అవకాశం ఉంది.
ప్రధానే జేపీసీకి పంపమన్నారు: అమిత్ షా
జమిలి ఎన్నికల బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి పంపించనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రారంభ దశలోనే ఈ బిల్లులపై విస్తృత చర్చలు జరగాలని ప్రధాని చెప్పినట్టు తెలిపారు. జేపీసీ ఇచ్చే నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన తర్వాత మళ్లీ పార్లమెంటులో చర్చించవచ్చని ఆయన పేర్కొన్నారు. కాగా, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఈ బిల్లులు రాజ్యాంగ మౌలిక స్వరూపంపై దాడి కాదని అర్జున్‌రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు.
తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు
జమిలి ఎన్నికల బిల్లులను ఇండియా కూటమి పార్టీలు, ఎంఐఎం తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ బిల్లులను ప్రవేశపెట్టడం దేశంలో నియంతృత్వాన్ని తీసుకువచ్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నమేనని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ ఆరోపించారు. ఈ బిల్లులు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం లేదా పార్లమెంటు కింద ఉండవని, ఈ బిల్లులు రాష్ర్టాల అసెంబ్లీల స్వతంత్రతను లాగేసుకుంటున్నాయని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ పేర్కొన్నారు. ఇది ఏమాత్రం ఎన్నికల సంస్కరణ కాదని, కేవలం ఒక వ్యక్తి కోరిక, కలను నెరవేర్చడమేనని అన్నారు. ఎన్డీఏయేతర పార్టీల్లో వైసీపీ మాత్రమే జమిలి బిల్లులకు మద్దతు ఇచ్చింది.
జమిలి ఎన్నికల చరిత్ర..
దేశంలో జమిలి ఎన్నికల ఆలోచన ఇప్పటిది కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జమిలి ఎన్నికలపై కేంద్రం మంగళవారం అధికారిక వివరణ ఇచ్చింది. రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిన తర్వాత 1951-52, 1957, 1962, 1967లో లోక్‌సభ, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1968, 1969లో పలు రాష్ర్టాల అసెంబ్లీలు ఐదేండ్లకు ముందే రద్దు కావడం వల్ల జమిలి ఎన్నికలకు ఆటంకం ఏర్పడింది. 1970లో నాలుగో లోక్‌సభ కూడా ముందే రద్దు కావడంతో 1971లో ఎన్నికలు జరిగాయి. ఐదో లోక్‌సభ వ్యవధిని ఎమర్జెన్సీ కారణంగా 1977 వరకు పొడిగించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com