OPPOSITION PARTYS: జమిలీ ఎన్నికలు రాష్ట్రాలపై దాడే

పార్లమెంటు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై అధ్యయనం చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ ఆలోచన దేశం, అందులోని రాష్ట్రాలపై దాడి చేయడమే అని మండిపడింది. రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసిన సమయం, విధివిధానాలను నిర్దేశించిన తీరు చూస్తుంటే సిఫార్సులు ఇప్పటికే నిర్ణయించినట్లు అనిపిస్తోందని హస్తం పార్టీ ఆరోపించింది. కమిటీ కూర్పుపైనా అనుమానాలు ఉన్నాయని అందుకే అందులో ఉండేందుకు తమ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి నిరాకరించినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్వీట్ చేశారు. అమిత్ షాకు అధీర్ రాసిన లేఖను కూడా ట్యాగ్ చేశారు. దేశం రాష్ట్రాల సమాహారమని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఒక దేశం-ఒక ఎన్నిక అంటే దేశం, అందులోని రాష్ట్రాలపై దాడిగా అభివర్ణిస్తూ రాహుల్ ట్వీట్ చేశారు.
ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అనేది ఓ పెద్ద కుట్ర అని, ఈ కుట్ర వెనుక ఉన్నది బీజేపీనేని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆరోపించారు. మనం చూస్తున్న, ఎదుర్కొంటున్న నియంతృత్వానికి మరో నిదర్శనమే జమిలి ఎన్నికల ఆలోచన అని, ఇది ఓ పెద్ద కుట్ర అని విమర్శించారు. ఈ కుట్ర వెనుక ఉన్నది బీజేపీనే అని, దేశ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ బలవంతంగా మనపై జమిలి ఎన్నికలను రుద్దాలనుకుంటున్నారని స్టాలిన్ విమర్శించారు. ఈ కుట్రను పటాపంచలు చేయాల్సిందే అన్నారు. దేశానికి రాష్ట్రపతిగా పనిచేసినవాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఒకే దేశం-ఒకే ఎన్నిక వల్ల ఎన్నికల ఖర్చు తగ్గుతుందని చెప్తున్నారని, ఇది ముమ్మాటికీ తప్పు అని స్టాలిన్ వెల్లడించారు. ముందు మీ అవినీతికి ఫుల్‌స్టాప్ పెడితే బాగుంటుందని సూచించారు.
ఒకే దేశం-ఒకే ఎన్నిక ఆలోచన వెనుక హేతుబద్ధత ఏమిటని, సామాన్యుడికి దీనివల్ల ఒరిగేదేమిటో తెలియడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రం వైఖరిని విమర్శించారు. అసలు ఈ దేశానికి ఏది ముఖ్యం? ఒకే దేశం-ఒకే ఎన్నిక లేక ఒకే దేశం-ఒకే విద్య, ఒకే దేశం-ఒకే వైద్యం కావాలా? అసలు సామాన్యుడు ఈ ఒకే దేశం-ఒకే ఎన్నిక ద్వారా ఏం లబ్ధి పొందుతాడు? జమిలితో అతనికి ఒరిగేదేమిటి?’ అని ప్రశ్నిస్తూ ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ‘వన్ నేషన్ వన్ ఫ్రెండ్’ స్కీమ్‌పై దృష్టి సారించిందని దుయ్యబట్టారు. అదానీ గ్రూప్‌నకు కాంట్రాక్ట్ కోసమే గ్రీస్‌లో ప్రధాని మోదీ ఇటీవల పర్యటించారని ఆయన ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com