బీహార్ లో కొనసాగుతోన్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండోదశ పోలింగ్ చురుగ్గా సాగుతోంది. 17 జిల్లాల్లోని 94 స్ధానాల్లో జరుగుతున్న పోలింగ్ కోసం ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సీఎం నితీశ్ కుమార్, మహాకూటమి సీఎం అభ్యర్ధి తేజస్వీ యాదవ్, ఆయన తల్లి, మాజీ సీఎం రబ్రీదేవితో పాటు పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
దిఘాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఓటు వేశారు. పాట్నాలో మహాకూటమి సీఎం అభ్యర్ధి తేజస్వీ, ఆయన తల్లి రబ్రీదేవి ఓటేశారు. కరోనా జాగ్రత్తలు తీసుకుని అందరూ ఓటు వేయాలని తేజస్వీ కోరారు. బీహార్‌లో మార్పు పవనాలు వీస్తున్నాయని, ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని ఓటేసిన తర్వాత తేజస్వీ వ్యాఖ్యానించారు.
ఈ పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకే ముగియాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో ఆరు గంటల వరకూ అవకాశం ఇచ్చారు. కరోనా రోగుల కోసం చివరి గంట కేటాయించారు. 8 సమస్యాత్మక నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఓటేసేందుకు వచ్చే 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, రోగుల కోసం ఎన్నికల సంఘం ఉచిత రవాణా సదుపాయం కల్పించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com