దేశ రాజధాని సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు

దేశ రాజధాని సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు

దేశ రాజధాని సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇవాల్టి నుంచి ఆందోళనలను మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని రైతులు తేల్చి చెబుతున్నారు. షరతులతో కూడిన చర్చలకు తాము సిద్ధంగా లేమని.. రైతులు స్పష్టం చేస్తున్నారు. దేశ రాజధానిలోకి ప్రవేశించే అన్ని మార్గాలను దిగ్బంధిస్తామని హెచ్చరిస్తున్నారు. రహదారులపై నిరసన విరమించి బురాడీ గ్రౌండ్‌కు రావాలన్నకేంద్ర ప్రభుత్వ సూచనలపై రైతులు మండిపడుతున్నారు. తాము రామ్‌లీలా మైదాన్‌లోకి వచ్చి నిరసన తెలుపుతామని డిమాండ్ చేస్తున్నారు..

వరుసగా ఆరు రోజులుగా రైతులు ఇదే పట్టుదలతో ఉన్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందే నంటూ తెగేసి చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గేది లేదంటూ ఢిల్లీ సరిహద్దుల్లో భీష్మించుకుని కూర్చొన్నారు. చలిలోనూ.. తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. లాఠీ చార్జ్‌లు... వాటర్ కేనన్‌ల దాడులను తట్టుకుని.. ఎదురు నిలబడుతున్నారు.

రైతుల ఆందోళనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా... వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్‌తో సమావేశమయ్యారు. అన్నదాతల ఆందోళన నేపథ్యంలో గత 24 గంటల్లో కేంద్ర మంత్రులు భేటీ అవడం ఇది రెండో సారి. చర్చలపై కేంద్ర ప్రభుత్వ ఆహ్వానాన్ని రైతులు తిరస్కరించాక ఇద్దరు కేంద్ర మంత్రులు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కేంద్రం చర్చల పేరుతో కాలయాపన చేస్తోందని... రైతులు ఆందోళనలను మరింత పెంచుతున్నారు. ఇప్పటికీ పలు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వెళ్లే మార్గాల్లో వేల మంది రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. అంత చలిలోనే అక్కడే వంటలు చేసుకుంటూ... నిరసనలు కొనసాగిస్తున్నారు. నిరంకారీ మైదాన్‌కు చేరుకున్న పలువురు.. అక్కడే ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఢిల్లీ- హర్యానా సరిహద్దుల్లోనూ రైతుల నిరసనలు తారాస్థాయికి చేరుతున్నాయి. సింఘు బార్డర్‌లో... వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. నిరసనలు చేపడుతున్నారు. యూపీ బార్డర్‌లోనూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో టిక్రి, సింఘు బార్డర్‌లను ఢిల్లీ పోలీసులు మూసివేశారు..

మరోవైపు రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతు క్రమంగా పెరుగుతోంది. షాహీన్‌ బాగ్ నుంచి కొందరు మహిళలు... రైతు సంఘాలకు మద్దతుగా నిలిచారు. సుమారు 3 లక్షల మంది చేస్తున్న ఆందోళనలను తక్కువ చేసి చూడరాదని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మరోవైపు.. ఢిల్లీ- హర్యానా సరిహద్దుల్లో రైతులకు కొందరు వైద్యులు స్వచ్ఛందంగా మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Tags

Next Story