Operation Sindoor: రాజకీయ నాయకత్వం ఆంక్షల వల్లే ఆపరేషన్ సిందూర్‌లో భారత్ విమానాలు కోల్పోయింది..

‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి ఇండోనేషియాలో భారత రక్షణ దళ ప్రతినిధి కెప్టెన్ శివకుమార్ మాట్లాడిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ఆపరేషన్ సింధూర్ ప్రారంభ దశలో భారత వ్యూహాన్ని వివరించడంపై ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది. ఇండోనేషియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక సెమినార్‌లో కెప్టెన్ కుమార్ ఒక ప్రజెంటేషన్ ఇస్తూ.. ఆపరేషన్ అడ్డంకులు ఎదుర్కొందని, రాజకీయ నాయకత్వం భారత వైమానిక దళం(ఐఏఎఫ్) పాకిస్తాన్ సైనిక స్థావరాలు, వారి వైమానిక ఆస్తులపై దాడులు చేయకూడదని కోరుకుందని చెప్పారు.
‘‘భారత్ కొన్ని విమానాలను కోల్పోయిందని, పాకిస్తాన్ మిలిటరీ ఆస్తులపై దాడి చేయకూడదనే రాజకీయ నిర్ణయం వల్లే ఇది జరిగింది’’ అని జూన్ 10న ఇండోనేషియా సెమినార్‌లో కెప్టెన్ శివకుమార్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని తప్పుదారి పట్టించిందని విమర్శించింది. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఎక్స్‌లో.. గతంలో సీడీఎస్ అనిల్ చౌహాన్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. సింగపూర్‌లో జరిగిన ఒక సమావేశంలో అనిల్ చౌహాన్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో తమకు కొన్ని వైమానిక నష్టాలు ఉన్నాయని అంగీకరించారు. అయితే, పాకిస్తాన్ చెబుతున్నట్లు ‘‘ఆరు విమానాలను కూల్చేశాం’’ అనే ప్రకటనను మాత్రం తోసిపుచ్చారు.
అసలు అధికారి ఏమన్నారు?
వివాదానికి దారితీసిన వ్యాఖ్యలను కెప్టెన్ శివ్ కుమార్ జూన్ 10న ఇండోనేషియాలో జరిగిన ఒక సెమినార్‌లో చేశారు. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ కింద దాడులు చేసినప్పుడు భారత వైమానిక దళం ‘కొన్ని విమానాలను’ కోల్పోయిందని ఆయన తన ప్రజెంటేషన్‌లో వెల్లడించారు. తొలిదశ దాడిలో పాకిస్థాన్ సైనిక స్థావరాలను గానీ, వారి గగనతల రక్షణ వ్యవస్థలను గానీ లక్ష్యం చేసుకోవద్దని తమకు రాజకీయ నాయకత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ‘రాజకీయ నాయకత్వం విధించిన ఆ పరిమితుల కారణంగానే ఐఏఎఫ్ కొన్ని యుద్ధ విమానాలను నష్టపోవాల్సి వచ్చింది’ అని ఆయన వివరించారు.
ఈ నష్టం తర్వాత భారత సైన్యం తమ వ్యూహాలను మార్చుకుందని కూడా కెప్టెన్ కుమార్ తెలిపారు. "ఆ తర్వాత మేము సైనిక స్థావరాలపై దృష్టి పెట్టాం. మొదట శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేశాం. అనంతరం బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించి మా దాడులన్నీ సులభంగా జరిగాయి" అని ఆయన పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com