Opposition Meet: మమతా బెనర్జీ నేతృత్వంలో విపక్షాల సమావేశం.. మరో వారంలో మళ్లీ..

Opposition Meet: మమతా బెనర్జీ నేతృత్వంలో విపక్షాల సమావేశం.. మరో వారంలో మళ్లీ..
Opposition Meet: ఓవైపు రాష్ట్రపతి ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల.. మరోవైపు అపోజిషన్ పార్టీల మీటింగ్‌.

Opposition Meet: ఓవైపు రాష్ట్రపతి ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల.. మరోవైపు అపోజిషన్ పార్టీల మీటింగ్‌తో హస్తిన రాజకీయాలు వేడెక్కాయి. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ జూన్ 29 అని ఎన్నికల సంఘం పేర్కొంది. 30వ తేదీ వరకు నామినేషన్లను పరిశీలన, జులై 2న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ప్రకటించింది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. దీంతో ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో విపక్షాలు సమావేశం నిర్వహించాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన ఈ కీలక భేటీకి 17 పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై ప్రధానంగా చర్చించారు. విపక్షాలన్నీ ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించినట్లు మమతా బెనర్జీ తెలిపారు. ఇది ఆరంభం మాత్రమేనని.. మరో వారంలో మరోసారి భేటీ అయి రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చిస్తామని స్పష్టంచేశారు. తామంతా ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్‌పవార్‌ను నిలబెట్టాలని నిర్ణయించామని.. అయితే ఆయన అంగీకరించకుంటే తరువాత ఎవరిని నిలబెట్టాలనేది మరో సమావేశంలో నిర్ణయిస్తామని మమతా బెనర్జీ తెలిపారు. సమావేశంలో మొత్తం 17 ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్, రణదీప్ సూర్జేవాలా హాజరయ్యారు. ఎన్సీపీ నుంచి శరద్‌ పవార్, సమాజ్‌వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్, జేడీఎస్ నుంచి మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామి, రాష్ట్రీయ జనతాదళ్ నుంచి మనోజ్‌ ఝ, శివసేన నుంచి ప్రియాంక చతుర్వేది, డీఎంకే నుంచి టిఆర్ బాలు, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఒమర్ అబ్దుల్లా, పిడిపి నాయకురాలు మెహబూబా ముఫ్తీ, సీపీఐ నుంచి బినయ్ విశ్వం, సీపీఎం నుంచి కరీం, రాష్ట్రీయ లోక్‌దళ్ నేత జయంత్ చౌదరి, ఇండియన్ ముస్లిం లీగ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

అన్ని పార్టీల నాయకులను కానిస్టిట్యూషన్ క్లబ్‌ బయట ఉండి మమతా బెనర్జీ స్వయంగా రిసీవ్ చేసుకున్నారు. అయితే, సమావేశం ప్రారంభానికి ముందే మమతా బెనర్జీకి నాలుగు పార్టీలు షాక్ ఇచ్చాయి. టీఆర్ఎస్, ఆప్, ఎస్ఏడీ, బీజేడీ పార్టీలు సమావేశానికి గైర్హాజరు అయ్యాయి. ప్రధానంగా ఈ మీటింగ్‌కు కాంగ్రెస్‌ను ఆహ్వానించడంపై టీఆర్‌ఎస్‌ అభ్యంతరం తెలిపింది. మరోవైపు విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్ వైపే మెజార్టీ నేతలు మొగ్గుచూపుతున్నారు.

అయితే ఆయన మాత్రం పోటీ చేయబోనని స్పష్టంచేశారు. కానీ, మమత మాత్రం శరద్ పవార్‌ అభ్యర్థిత్వంపై పట్టువీడడం లేదు. శరద్ పవార్‌ ఇంటికి వెళ్లి మరీ మమత చర్చలు జరిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయాలని కోరారు. అటు సీతారాం ఏచూరి నేతృత్వంలోని లెఫ్ట్‌ ఫ్రంట్‌ నేతలు కూడా శరద్‌ పవార్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఒప్పించేందుకు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇక శరద్‌ పవార్ ఒప్పుకోని పక్షంలో మహాత్మాగాంధీ మనవడు వరుణ్‌గాంధీని ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలని యోచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story