బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల చారిత్రాత్మక భేటీ

బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల చారిత్రాత్మక భేటీ
బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాల కీలక భేటీ... హాజరుకానున్న 20 పార్టీల నేతలు... రాజకీయాలు పెను మార్పులకు అంకురార్పణ జరుగుతుందన్న అంచనాలు..

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు మరికాసేపట్లో బీహార్‌ రాజధాని పాట్నాలో దాదాపు 20 ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశం కానున్నారు. నిత్యం కీచులాడుకుంటూ, ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నించే ప్రతిపక్షాల మధ్య జరగనున్న ఈ కీలక సమావేశం.. దేశ రాజకీయ యవనికపై పెను మార్పులకు శ్రీకారం చుడుతుందన్న అంచనాలు ఉన్నాయి. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించి ఊపు మీదున కాంగ్రెస్‌ పార్టీ ఈ సమావేశంలో కీలక భూమిక పోషించనుంది. ఈ కీలక సమావేశంలో పాల్గొనేందుకు పాట్నా చేరుకున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్‌గాంధీకి ఘ‍న స్వాగతం లభించింది. ఈ సమావేశానికి నేతృత్వం వహిస్తున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇరువురు అగ్ర నేతలకు ఘన స్వాగతం పలికారు.కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని తొలగించడమే ప్రతిపక్ష పార్టీల ఎజెండా అని కాంగ్రెస్‌ అధినేత ఖర్గే ఇప్పటికే ప్రకటించారు. అందరం కలిసి పోరాడతామని ఆయన విపక్షాలకు పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.. రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు జయంత్ చౌదరి సహా 20 పార్టీల నేతలు ఇప్పటికే పాట్నా చేరుకున్నారు. జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సమావేశానికి హాజరుకానున్నారు. పాట్నా చేరుకోగానే మమతా బెనర్జీ... లాలుప్రసాద్‌ యాదవ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశం విపక్షాల ఐక్యతా మార్గంలో ముఖ్యమైన మైలురాయని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ భేటీకి బీఎస్పీ అధినేత్రి మాయావతిని ఆహ్వానించకపోవడం విమర్శలకు తావిచ్చింది. దీనిపై మాయావతి మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయని.. బీజేపీని ఓడించాలంటే ఈ సీట్లు కీలకమని.. కానీ ప్రతిపక్షాలకు ఆ విషయమే పట్టలేదని విమర్శించారు. ప్రతిపక్షాల భేటీపై బీజేపీ విమర్శలు గుప్పించింది.మోడీ మూడోసారి అధికారంలోకి రాగానే అవినీతి’ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతిపక్ష నేతలను అరెస్ట్‌ చేస్తారనే భయంతోనే.. ఈ భేటీ జరుగుతోందని బీహార్‌ బీజేపీ నేత సుశీల్‌ మోదీ విరుచుకుపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story