New Delhi : ఢిల్లీలో ఒక్కటవుతున్న విపక్షాలు.. 2024 ఎన్నికలే టార్గెట్..

New Delhi : 2024 ఎన్నికలే టార్గెట్‌గా విపక్షాలు అడుగులు వేస్తున్నాయి. ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ఐక్యతగా ముందుకు సాగుతున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో బీహార్ సీఎం నితీష్‌కుమార్, ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ భేటీ అయ్యారు. విపక్షాల ఐక్యత సహా అనేక అంశాలపై సోనియాతో చర్చించినట్లు నితీష్, లాలూ అన్నారు. అంతకుముందు.. హర్యానాలోని ఫతేబాద్‌లో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, నితీష్, లాలూ ప్రసాద్ యాదవ్ సహా మరికొందరు విపక్ష నేతలు.. దేవీలాల్ జయంతి వేడుకలకు హాజరయ్యారు.
మోదీ సర్కారు ఎనిమిదేళ్ల పాలనపై విపక్ష నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశం కోసం విపక్షాలన్నీ ఐక్యం కావాలని నితీష్ కుమార్ పిలుపునిచ్చారు. ఇంకా అనేక పార్టీలు విపక్షాల కూటమిలో చేరాలన్నారు. ఇది థర్డ్ ఫ్రంట్ కాదని.. అతి ముఖ్యమైన ఏకైక ఫ్రంట్ అని స్పష్టంచేశారు. విపక్ష కూటమి విజయం సాధించిన తర్వాత రైతులు, ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యలను పరిష్కరించవచ్చని నితీష్ తెలిపారు.
రైతుల ఆత్మహత్యలకు కారణమైన పాలకులను విపక్షాలన్నీ కలిసి గద్దె దింపాలన్నారు శరద్ పవార్. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. 2024లో విపక్షాలు అధికారంలోకి వచ్చాక రైతుల సమస్యలకు తప్పకుండా పరిష్కారం లభిస్తుందన్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని శరద్ పవార్ స్పష్టంచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com