బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యంగా ప్రతిపక్షాల పోటీ

బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యంగా ప్రతిపక్షాల పోటీ
X
ప్రతిపక్షాల కీలక ముందడుగు... 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం.. జులైలో మరోసారి భేటీ కానున్న విపక్షాలు... బీజేపీ పతనం ప్రారంభమైందని ప్రకటన...

ప్రతిపక్షాల కూటమి ఏర్పాటు దిశగా పాట్నాలో జరిగిన సమావేశంలో కీలక ముందడుగు పడింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీని ఓడించడమే లక్ష్యంగా సమావేశమైన విపక్షాలు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నాయి. ప్రతిపక్ష పార్టీల మధ్య మంచి సమావేశం జరిగిందని.. వచ్చే ఎన్నికల్లో కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నామని భేటీ అనంతరం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. ప్రతిపక్షాల భేటీకి నేతృత్వం వహించిన నితీశ్‌కుమార్.. త్వరలో మరో విపక్షాల సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీతో సహా ఇతర ప్రతిపక్ష నేతల సమక్షంలో జరిగిన విలేకరుల సమావేశంలో నితీశ్‌కుమార్‌ ఈ ప్రకటన చేశారు. విపక్షల పార్టీ తదుపరి సమావేశం జులైలో సిమ్లాలో జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. సిమ్లా సమావేశంలో 2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాల్లో కలిసికట్టుగా ఏవిధంగా పోరాడాలనే విషయంపై ఒక ఎజెండాను రూపొందిస్తామని ఆయన తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పనితీరును ఖర్గే విమర్శించారు. నిజానికి, తమలో విభేదాలు ఉన్నప్పటికీ కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించుకున్నామని, సిద్ధాంతాలపై పరస్పరం చర్చించుకుని వాటిని పరిరక్షించుకునేందుకు కృషిచేయాలని నిర్ణయించామని రాహుల్‌గాంధీ చెప్పారు. దేశపునాదులపై బీజేపీ దాడి చేస్తోందని, ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాడితేనే దేశాన్ని రక్షించుకోవచ్చని ఆయన సూచించారు. విపక్షాలన్నీ కలిసికట్టుగా ఉన్నాయని, కలిసికట్టుగానే ఎన్నికల్లో పోరాడతాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. బీహార్ నుంచే చరిత్ర ప్రారంభమైందని ఆమె అన్నారు. ఫాసిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించడమే తమ లక్ష్యమని మమత తేల్చి చెప్పారు.

Tags

Next Story