Maharashtra: అసలు లక్ష.. వడ్డీ రూ.73 లక్షలు!--చెల్లించేందుకు కిడ్నీ అమ్ముకున్న రైతు

Maharashtra: అసలు లక్ష.. వడ్డీ రూ.73 లక్షలు!--చెల్లించేందుకు కిడ్నీ అమ్ముకున్న రైతు
X
రోజుకు రూ.10 వేల చొప్పున వడ్డీ , గత్యంతరం లేక కిడ్నీ అమ్ముకున్న రైతు

వ్యవసాయంలో వరుస నష్టాలు రావడంతో పాల వ్యాపారం చేద్దామని ఆ రైతు రూ.లక్ష అప్పుగా తీసుకున్నాడు. ఇద్దరు వ్యాపారుల దగ్గర అప్పు తెచ్చి ఆవులు కొన్నాడు. అయితే వడ్డీ వ్యాపారులు రోజుకు రూ.10 వేల చొప్పున వడ్డీ వేయడంతో అది కాస్తా రూ.74 లక్షలకు చేరుకుంది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పు తీర్చేందుకు ఆయన కాంబోడియాకు వెళ్లి కిడ్నీ అమ్ముకున్నాడు. బీజేపీ పాలిత మహారాష్ట్రలో ఈ ఘటన చోటుచేసుకుంది. చందాపూర్‌ జిల్లాకు చెందిన రోషన్‌ సదాశివ్‌ కుడే అనే రైతుకు వ్యవసాయంలో వరుస నష్టాలు వచ్చాయి. దీంతో పాల వ్యాపారం మొదలుపెడదామనుకున్నాడు. ఇద్దరు వడ్డీ వ్యాపారుల నుంచి రూ.లక్ష అప్పు తీసుకుని ఆవులు కొన్నాడు. అయితే వ్యాపారం పుంజుకోకముందే ఆవులు మరణించాయి. మరోవైపు పంటలు ఫెయిల్‌ అయ్యాయి.

దీంతో మరింత అప్పుల్లో కూరుకుపోయాడు. ఇచ్చిన అప్పు చెల్లించాలని వడ్డీ వ్యాపారులు కుడేని వేధించారు. భారీగా వడ్డీ విధించారు. దీంతో పొలాన్ని, ట్రాక్టర్‌ని, ఇంట్లోని విలువైన వస్తువులను రైతు అమ్మేశాడు. అయినా అప్పు తీరలేదు. రుణం రికవరీ చేసుకునేందుకు వీరు ఆ రైతును లక్ష్మణ్‌ ఉర్కునే అనే వ్యక్తి దగ్గరకు తీసుకెళ్లగా, ఆయన రైతు అవసరాన్ని ఆసరాగా చేసుకుని 20 రోజులకు ఏకంగా 40 శాతం వడ్డీ వసూలు చేశాడు. అయినా అప్పు తీరకపోవడంతో ఆ వ్యాపారులు కిడ్నీ అమ్మాలని కుడేకి సలహా ఇచ్చారు. ఏజెంట్‌ ద్వారా కోల్‌కతాకు వెళ్లి పరీక్షలు నిర్వహించుకుని అక్కడ నుంచి కాంబోడియా వెళ్లిన కుడే కిడ్నీ అమ్ముకున్నందుకు రూ.8 లక్షలు పొందాడు. వడ్డీ కోసం తనను జలగల్లా పీల్చిన వ్యాపారులపై పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు లేవని, ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే తాను, తన కుటుంబం ముం బైలోని మంత్రాలయ ఎదుట ఆత్మాహుతి చేసుకుంటామని కుడే హెచ్చరించాడు.

Tags

Next Story