Hemant Soren: సుప్రీంకోర్టుకు హేమంత్‌ సొరేన్‌

Hemant Soren: సుప్రీంకోర్టుకు హేమంత్‌ సొరేన్‌
హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేసిన మాజీ సీఎం

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఆయన తన అరెస్టు సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. తిరస్కరించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలను ఆయన సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. సోరెన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ఈ విషయంపై ప్రస్తావించారు. సోరెన్‌ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు. అభ్యర్థనను పరిశీలిస్తామని జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా ధర్మాసనం పేర్కొంది.

ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ సోరెన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. అలాగే, బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో హేమంత్‌ సోరెన్‌ను జనవరి 31న ఈడీ ఆయనను అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన రాంచీలోని బిర్సా ముండా జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో సోరెన్ బెయిల్ పిటిషన్‌పై స్పందించేందుకు ఈడీకి హైకోర్టు వారం గడువు ఇచ్చింది.

సోరెన్‌పై విచారణ రాంచీలోని 8.86 ఎకరాల భూమికి సంబంధించినది. అక్రమంగా సీజ్ చేశారని ఈడీ ఆరోపించింది. సోరెన్, ప్రసాద్, రాజ్ కుమార్ పహన్, హిలారియాస్ కచాప్, మాజీ ముఖ్యమంత్రి సహాయకుడు బినోద్ సింగ్‌లపై ఏజెన్సీ మార్చి 30న ఇక్కడి ప్రత్యేక PMLA కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సోరెన్ రాంచీలోని ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తన అరెస్టు రాజకీయ ప్రేరేపితమని.. తనను బిజెపిలో చేరడానికి బలవంతం చేసే కుట్రలో భాగమని ఆరోపించారు. హేమంత్ సోరెన్ జైలుపాలవ్వటంతో ఆయన సతీమణి కల్పనా సోరెన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. జార్ఖండ్‌లో జరుగుతున్న శాసనసభ ఉపఎన్నికల్లో ఆమె పోటీ చేస్తున్నారు. ఆమెకు బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది.

ఇదిలా ఉంటే ఇటీవల హేమంత్ సోరెన్ మామ రాజారామ్ సోరెన్ చనిపోయారు. సోమవారం ఆయనది కర్మ కార్యక్రమం ఉంది. ఇందుకోసం ఈ వేడుకలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును కోరారు. దీంతో న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతితో హేమంత్ సోరెన్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయన్ను చూసిన వారంతా షాక్ అయ్యారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఫుల్ గడ్డం పెంచేశారు. మెరిసి పోయిన గడ్డం ఉండడంతో కొందరు కన్‌ఫ్యూజ్ అయ్యారు. ఇక ఆయన్ను చేసిన అభిమానులు, కార్యకర్తలు ఫొటోలు, సెల్పీలు దిగేందుకు ఎగబడ్డారు. హేమంత్ కూడా ఫొటోలు దిగేందుకు అవకాశం కల్పించారు.



Tags

Read MoreRead Less
Next Story