PRESIDENT: భారతీయతే మన గుర్తింపు

అంతర్జాతీయ వేదికపై భారత్‌కు సముచిత గౌరవం లభిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) అన్నారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం(77th Independence Day) సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన(Independence Day Message) రాష్ట్రపతి వివిధ రంగాల్లో దేశ అభివృద్ధి(India's development)ని గుర్తు చేశారు. భారత్ అధ్యక్ష స్థానంలో G 20 సమావేశాలు జరగడం గర్వకారణమని ద్రౌపది ముర్ము అన్నారు. మువ్వన్నెల జెండా చూస్తే మన హృదయం ఉప్పొంగుతుందని చెప్పారు. దేశ జీడీపీ ఏటా పెరుగుతోందని వివరించారు. భారత్.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని కొనియాడారు. తన విదేశీ పర్యటనల సమయంలో ప్రవాస భారతీయులతో జరిగిన చర్చల వేళ దేశంపై కొత్త విశ్వాసాన్ని గమనించానని ముర్ము తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి, మానవతా లక్ష్యాలను ప్రోత్సహించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మానవాళి సమస్యల పరిష్కారంలో భారత్ నాయకత్వ పాత్ర పోషిస్తోందని రాష్ట్రపతి గుర్తు చేశార. దేశంలో గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్న ముర్ము.. ఆదివాసీల అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మన మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు మహిళలు సిద్ధపడుతున్నారని రాష్ట్రపతి తెలిపారు.
ఈ ఏడాది చంద్రయాన్-3ను ప్రయోగించుకున్నామన్న ద్రౌపది ముర్ము.. చంద్రయాన్-3 జాబిల్లిపై అడుగుపెట్టే ఘడియ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం అనేక చర్యలు చేపట్టామని, సౌర, పవన విద్యుదుత్పత్తి పెంచే కార్యక్రమాలు చేపట్టామని, 2047లోగా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ ఉండాలని దిశా నిర్దేశం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తోందని రాష్ట్రపతి తెలిపారు.
మన అన్నదాతలు ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారన్న రాష్ట్రపతి, భారత దేశ ఆర్థిక వృద్ధిపై ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి ఉందని గుర్తు చేశారు. ఇప్పటికే భారత్ ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపు పొందిన భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా పయనిస్తోందని తెలిపారు. గడిచిన దశాబ్ద కాలంలో భారీ సంఖ్యలో ప్రజలను పేదరికం నుంచి బయటకు తెచ్చామన్న ద్రౌపది ముర్ము... ఆదివాసీల జీవిన ప్రమాణాలను మరింత పెంచేందుకు అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని గుర్తు చేశారు. ఆర్థిక వికాసంతో పాటు మానవ వికాసానికి కూడా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com