BENGAL: బెంగాల్ ఎన్నికల్లో రక్త చరిత్ర

పశ్చిమబెంగాల్ మరోసారి రక్తమోడింది. భారీ ఎత్తున కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులను మోహరించినప్పటికీ.. బంగాల్ పంచాయతీ ఎన్నికల్లో హింస ప్రజ్వరిల్లింది. పోలింగ్ వేళ చెలరేగిన రాజకీయ హింసలో 16మందికిపైగా మరణించారు. బూత్‌ల లూటీ, బ్యాలెట్ల పత్రాల దగ్ధంతో బెంగాల్లో యుద్ధవాతావరణం నెలకొంది. శనివారం పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడికి దిగారు. గంటలు గడిచే కొద్దీ హింస పెరుగుతూ పోయింది. హింసాత్మక ఘటనలతో పలు చోట్ల నిషేధాజ్ఞలు జారీ చేశారు.
హింసకు మీరంటే మీరే కారణమంటూ పార్టీలన్నీ పరస్పర ఆరోపణలకు దిగాయి. మృతుల్లో అధికంగా అధికార టీఎంసీ కార్యకర్తలు, నేతలే ఉండగా.. బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ కార్యకర్తలూ మరణించినట్లు ఆయా పార్టీలు తెలిపాయి. తమ పార్టీకి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. ఈ హింసకు ప్రతిపక్ష పార్టీలే కారణమని తృణమూల్ ఆరోపించింది. దాదాపు 600 కంపెనీల కేంద్ర బలగాలు, 70వేల మంది బంగాల్ పోలీసులను సైతం మోహరించారు. ఇన్ని కేంద్ర బలగాలు ఉన్నప్పటికీ హింస ఎలా జరుగుతోందని అధికార తృణమూల్ ప్రశ్నించింది.
కూచ్‌బిహార్ జిల్లాలో ఫాలిమరి గ్రామ పంచాయతీలో జరిగిన హింసలో తమ ఏజెంట్ చనిపోయినట్లు బీజేపీ తెలిపింది. హింసపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. పంచాయతీ ఎన్నికల హింసపై పశ్చిమబెంగాల్ ఎన్నికల సంఘం కమిషనర్‌కు ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఫిర్యాదు చేశారు. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతంలో రీ పోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని సీఎం మమతా బెనర్జీని ఆదేశించాలని ఆయన ఎన్నికల కమిషనర్‌ను కోరారు. హింసపై పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ అమిత్ షాకు లేఖ రాశారు. రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు.
పంచాయతీ ఎన్నికల వేళ చెలరేగిన హింసపై బెంగాల్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ సిన్హా స్పందించారు. నాలుగు జిల్లాల నుంచే అత్యధికంగా హింసాత్మక ఘటనలపై ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. రీ పోలింగ్‌పై ఇవాళ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బెంగాల్ హింసపై కేంద్రం ఆరా తీసింది. ఏం జరుగుతుందో నివేదిక ఇవ్వాలంటూ బెంగాల్ ప్రభుత్వాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
బెంగాల్లో 22 జిల్లా పరిషత్‌లలోని 928 స్థానాలకు, 9,730 పంచాయతీ సమితులకు, 63,229 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 5 కోట్ల మందికిపైగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. 66.28% ఓటింగ్ నమోదైంది. జూలై 11న ఓట్ల లెక్కింపు జరగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com