Haryana : 50 మంది స్కూల్ విద్యార్థినులపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు..

విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ప్రిన్సిపల్ కీచకుడయ్యాడు. పాఠశాలలోని సుమారు 50 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.ఈ ఘటనపై విద్యార్థులే స్వయంగా ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. చండీగఢ్ లోని జింద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 50 మంది విద్యార్థినులు తమ ప్రిన్సిపాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అయితే ప్రిన్సిపల్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించినా.. ఫిర్యాదులను పట్టించుకోకపోవడంపై హర్యానా రాష్ట్ర మహిళా కమీషన్ పోలీసులను నిలదీసింది.
జింద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 50 మంది విద్యార్థినులపై ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. స్వయంగా బాధిత విద్యార్థులే ప్రిన్సిపల్‌పై ఫిర్యాదు చేశారు. అయితే, ఈ విషయంలో పోలీసులు అలసత్వం ప్రదర్శించడం పట్ల హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్‌ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాల విద్యార్థినుల ఫిర్యాదులను తాము సెప్టెంబర్ 14వ తేదీన పోలీసులకు పంపినట్లు తెలిపింది. అయితే అక్టోబర్ 30న చర్యలు తీసుకున్నట్లు కమిషన్ పేర్కొంది. ఫిర్యాదు చేసిన నెలన్నర తర్వాత ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది.
నిందితుడిని అరెస్టు చేసేందుకు జింద్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం జిల్లాకు చెందిన ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ, 55 సంవత్సరాల వయస్సు గల ప్రిన్సిపాల్ దొరకకుండా అరెస్టు నుండి తప్పించుకుంటున్నారని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేణు భాటియా మాట్లాడుతూ.. ‘ప్రిన్సిపల్‌పై విద్యార్థినుల నుంచి మాకు 60 లిఖితపూర్వక ఫిర్యాదులు అందాయి. వీటిలో 50 మంది విద్యార్థులు నేరుగా ప్రిన్సిపల్ చేతిలో శారీరక వేధింపులకు గురైన వారే. మరో పది మంది అమ్మాయిలు ప్రిన్సిపల్ ఇలాంటివి (లైంగిక వేధింపులు) చేస్తారని తమకు తెలుసునని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు’ అని ఆమె వివరించారు. ఫిర్యాదు చేసిన వారంతా మైనర్లని భాటియా తెలిపారు. ఈ విషయంలో పోలీసుల తీరుపై భాటియా మండిపడ్డారు.
నిందితుడు తమను తన కార్యాలయానికి పిలిచి అసభ్యకర చర్యలకు పాల్పడేవాడని బాధితులు ఆరోపించారు. కొంతమంది విద్యార్థినుల నుంచి సెప్టెంబర్ 13న ఫిర్యాదును స్వీకరించినట్లు చెప్పారు. ఆ తర్వాతి రోజు అంటే సెప్టెంబర్ 14న పోలీసులకు ఫార్వర్డ్ చేసినట్లు చెప్పారు. అయితే, సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 29 వరకు వారు ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తమకు ఫోన్ కాల్స్ వచ్చాయని కొందరు బాలికలు ఆరోపిస్తూ గురువారం సాయంత్రం కమీషన్‌ను సంప్రదించారు. తమ ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారని ఆమె తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com