Maha Kumbh: కుంభమేళాలో కొనసాగుతున్న రద్దీ..

Maha Kumbh: కుంభమేళాలో కొనసాగుతున్న  రద్దీ..
X
53 కోట్ల మంది పుణ్యస్నానాలు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ లో జరుగుతున్న మహా కుంభమేళాకు నిత్యం యాత్రికులు వరదలా పోటెత్తుతున్నారు. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ రికార్డు స్థాయిలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించారు. ఈ మేళా జరుగుతున్న త్రివేణి సంగమం లో ఆదివారం సాయంత్రం వరకూ 53 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్‌ ప్రకటించింది. ప్రపంచంలోనే ఇంత మంది భక్తులు పాల్గొన్న మొదటి కార్యక్రమంగా కుంభమేళా రికార్డు సృష్టించింది.

కాగా, పౌష్‌ పూర్ణిమ సందర్భంగా జనవరి 13వ తేదీన మహాకుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 శివరాత్రి వరకూ ఈ కుంభమేళా కొనసాగనుంది. దాదాపు 45 రోజులపాటూ జరిగే ఈ మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 50 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం ముందుగానే అంచనా వేసింది. అయితే, అంచనాలకు మించి భక్తులు తరలివస్తున్నారు.

ఇక రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో కుంభమేళాను పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ మేళా ఈ నెల 26తో ముగియాల్సి ఉండగా.. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మరో రెండు రోజులు పొడిగించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగానే కుంభమేళాలో విధులను నిర్వహిస్తున్న పోలీసులు, అధికారుల విధులను మరో రెండు రోజులపాటు పొడిగించినట్లు తెలుస్తున్నది.

Tags

Next Story