World Cup Final: వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు భారీ భద్రత

World Cup Final:  వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు భారీ భద్రత
6 వేల మంది సిబ్బంది మోహరింపు

మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్‌లోవన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌మ్యాచ్‌ జరుగనుంది. టోర్నీలో ఓటమినే ఎరుగని టీమ్‌ఇండియా, ఐదుసార్లు విశ్వవిజేత ఆస్ట్రేలియా తుదిపోరులో తలపడనున్నాయి. లక్షా ముప్పై వేల మంది అభిమానులు, ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్‌ మార్లెస్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, తమిళనాడు, అసోం ముఖ్యమంత్రులతోపాటు అతిరతమహారథులు ఈ మెగా ఫైనల్‌కు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌ పోలీస్‌ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 6 వేలకుపైగా మంది సిబ్బందిని మోహరించింది.

క్రికెట్ మైదానంలో 3వేలమందిని మోహరించారు. క్రికెట్ క్రీడాకారులున్న హోటళ్లు, వీవీఐపీలు బస చేసిన అతిథి గృహాల వద్ద మరో 3వేలమందిని బందోబస్తుగా నియమించారు. క్రికెట్ గ్రౌండులో తాత్కాలిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం వైర్‌లెస్ నెట్‌వర్క్‌తో మొబైల్ కమ్యూనికేషన్‌తో కూడా పనిచేస్తుంది.


నలుగురు ఐజీ.డీఐజీ ర్యాంకుకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు,39 మంది అసిస్టెంట్ పోలీసు కమిషనర్లు, 92 మంది పోలీసు ఇన్‌స్పెక్టర్లు బందోబస్తు విధుల్లో ఉంటారు. మ్యాచ్‌లో ఏదైనా రసాయన, జీవ, రేడియోలాజికల్, న్యూక్లియర్ అత్యవసర పరిస్థితులపై స్పందించడానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం బృందాలను కూడా నగరంలో మోహరించారు. మొత్తం 6 వేల మందిలో 3 వేల మంది స్టేడియం లోపల మోహరించామని, మిగిలినవారిని స్టేడియ బయట, నగరంలో మోహరించామన్నారు. ఫైనల్ మ్యాచ్ ను తిలకించేందుకు క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్ లు అహ్మదాబాద్ వెళ్లేందుకు ఆదివారం ఉదయం ముంబయి విమానాశ్రయానికి వచ్చారు. క్రికెట్ ఫైనల్ టోర్నీలో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ పెద్ద ముప్పుగా మారబోతున్నాడని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అభిప్రాయపడ్డారు.

మరోవైపు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బైధ్యనాథ్ మహదేవ్ దేవాలయంలో టీమిండియా విజయాన్ని కోరుతూ 11 మంది పండితులు ప్రత్యేక జలంతో అభిషేకం చేశారు. ఆస్ట్రేలియాపై భారత్ విజయాన్ని కాంక్షిస్తూ శివాలయంలో పాలు, పెరుగు, తేనేతో అభిషేకం చేశారు. ఈ ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని భారత జట్టు ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించాలని ప్రార్థించారు.


Tags

Read MoreRead Less
Next Story