ECI: సూర్జేవాలాపై ఈసీ చర్య...

ECI: సూర్జేవాలాపై ఈసీ చర్య...
X
48 గంటల పాటు ఎన్నికల ప్రచారంపై వేటు

బాలీవుడ్ నటి, బీజేపీ సిట్టింగ్ ఎంపీ హేమమాలినిపై 'అభ్యంతరకర' వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలాపై భారత ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా ఆయనపై వేటు వేసింది. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది.

''భారత రాజ్యాంగంలోని 324వ అధికరణ, ఇతర అధికారాల కింద 16 ఏప్రిల్ 2024 సాయంత్రం 6 గంటల నుంచి 48 గంటల పాటు ఆయన ఎలాంటి ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనరాదు. ఊరేగింపులు, పబ్లిక్ ర్యాలీలు, రోడ్‌షోలు, ఇంటర్వ్యూలు, మీడియాకు దూరంగా ఉండాలి'' అని ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది. మధుర ఎంపీ హేమమాలినిని అగౌరవపరచేలా సూర్జేవాలా వ్యాఖ్యలు చేశారంటూ ఈసీకి బీజేపీ ఇటీవల ఫిర్యాదు చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం గత నెలలో సూర్జేవాలాకు షోకాజ్ నోటీసు ఇచ్చింది.

ఉత్తరప్రదేశ్‌లోని మథుర నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిని హేమామాలినిపై కాంగ్రెస్‌ అభ్యర్థి రణదీప్ సింగ్ సూర్జేవాలా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజలు తమ ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎందుకు ఎన్నుకుంటారు? ప్రజల గొంతును వారు పెంచుతారని. ఎన్నికై దాక్కున్న హేమామాలిని వంటి వారిని కాదు’ అని అన్నారు. కాగా, బీజేపీ షేర్‌ చేసిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ఈ నెల 9న సుర్జేవాలాతోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే ఫిర్యాదుదారులు ఆ వీడియో క్లిప్‌ను ఎడిట్‌ చేశారని సుర్జేవాలా ఆరోపించారు. హేమామాలినితో సహా ఏ మహిళను తాను అవమానించలేదని వివరణ ఇచ్చారు. సంతృప్తి చెందని ఈసీ 48 గంటలపాటు ప్రచారం చేయవద్దని సుర్జేవాలాను ఆదేశించింది.

Tags

Next Story