ఢిల్లీ వాసులకు ఊరట.. వరుణుడు కరుణించి..

గత వారం రోజులుగా కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీ వాసుల్ని వరుణ దేవుడు కరుణించాడు. నాలుగు చినుకులు కురిపించి ఊరట కల్పించాడు. గురువారం రాత్రి వర్షం కురియడంతో శుక్రవారం ఉదయం గాలి నాణ్యతలో మెరుగుదల కనిపించింది.
వాతావరణ పరిస్థితుల కారణంగా తేలికపాటి వర్షం కురుస్తుందని, గాలి నాణ్యతలో స్వల్ప మెరుగుదల ఉంటుందని భారత వాతావరణ విభాగం (IMD) ముందుగా అంచనా వేసింది. వాయువ్యం నుండి ఆగ్నేయానికి గాలి దిశలో మార్పు, వ్యర్ధాలను దహనం చేస్తే వచ్చే పొగను తగ్గించడంలో సహాయపడుతుందని IMD అధికారులు తెలిపారు.
వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, క్లౌడ్ సీడింగ్ ద్వారా నవంబర్ 20-21 తేదీల్లో కృత్రిమ వర్షం కురిపించాలని నగర ప్రభుత్వం యోచిస్తోంది. వాయుకాలుష్యంపై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టుకు శుక్రవారం దీనికి సంబంధించిన ప్రతిపాదనను సమర్పించనున్నారు.
ఢిల్లీలో కాలుష్య నిబంధనలను ఉల్లంఘించినందుకు వాహనదారులకు 4 రోజుల్లో 9,200 చలాన్లు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా దేశ రాజధానిలో యాప్ ఆధారిత ట్యాక్సీల ప్రవేశాన్ని నిషేధించినట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.
ఢిల్లీలోని కలుషిత గాలిని పీల్చడం రోజుకు దాదాపు 10 సిగరెట్లు తాగడం వల్ల కలిగే దుష్పరిణామాలకు సమానమని వైద్యులు చెబుతున్నారు. కాలుష్యానికి ఎక్కువ కాలం గురికావడం వల్ల ఆస్తమా, బ్రోన్కైటిస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) వంటి శ్వాసకోశ సమస్యలను తీవ్రతరం చేస్తుంది. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని వైద్యులు వివరిస్తున్నారు.
నగరంలో గాలి నాణ్యత "తీవ్రమైన ప్లస్" (AQI 450 కంటే ఎక్కువ) స్థాయికి పడిపోయిన తర్వాత, GRAP యొక్క IV దశ కింద ఉన్న ఆంక్షలు, అన్ని రకాల నిర్మాణ పనులపై నిషేధం, కాలుష్య ట్రక్కుల ప్రవేశంతో సహా ఆదివారం అమలులోకి వచ్చాయి..
GRAP చర్యలను నాలుగు దశలుగా వర్గీకరిస్తుంది: స్టేజ్ I — పూర్ (AQI 201-300); స్టేజ్ II - చాలా పూర్ (AQI 301-400); స్టేజ్ III — తీవ్రమైన (AQI 401-450) మరియు స్టేజ్ IV — తీవ్రమైన ప్లస్ (AQI 450 పైన). అననుకూల వాతావరణ పరిస్థితులు, వాహన ఉద్గారాలు, వరి-గడ్డిని కాల్చడం, పటాకులు, ఇతర స్థానిక కాలుష్య వనరులతో కలిపి, శీతాకాలంలో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో గాలి నాణ్యత క్షీణించడానికి కారణమవుతుంది.
ఢిల్లీ వాయు కాలుష్యానికి మమ్మల్ని కారణం చేస్తున్నారు. అనవసరం మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, పరువు తీస్తున్నారని పంజాబ్ రైతులు ఆరోపిస్తున్నారు. ఆగస్టులో చికాగో విశ్వవిద్యాలయం (EPIC)లోని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ సంకలనం చేసిన నివేదిక ప్రకారం, వాయు కాలుష్యం ఢిల్లీలో దాదాపు 12 సంవత్సరాల జీవితాన్ని తగ్గిస్తుంది అని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com