ఏనుగులను సంరక్షించే మహిళా మావటికి పద్మశ్రీ పురస్కారం

ఏనుగులను సంరక్షించే మహిళా మావటికి పద్మశ్రీ పురస్కారం
14 సంవత్సరాల వయస్సులోనే పర్బతి బారుహ్ ఏనుగులను మచ్చిక చేసుకోవడం నేర్చుకుంది.

14 సంవత్సరాల వయస్సులోనే పర్బతి బారుహ్ ఏనుగులను మచ్చిక చేసుకోవడం నేర్చుకుంది. ఆమె తండ్రి ప్రకృతిష్ చంద్ర బారువా ద్వారా ఏనుగుల నిర్వహణ రంగంలోకి ప్రవేశించింది.

అస్సాంలోని గౌరీపూర్ కు చెందిన పర్బతికి ఏనుగులు కొత్త కాదు. ఏనుగులతో శతాబ్దాల నాటి బంధం ఉన్న అస్సామీ జమీందార్లు ఆమెను పెంచారు. వాటితో ఆమె చిన్నప్పటి నుంచి ఆడుకునేది. తండ్రి ప్రకృతేష్ బారువా ప్రపంచవ్యాప్తంగా ఏనుగులపై అత్యంత గుర్తింపు పొందిన అధికారి.

వీరి కుటుంబం ఏనుగులను పట్టుకోవడం వాటిని విక్రయించడం చేసేది. ఏనుగులు కొనుగోలు చేసే ఖాతాదారులలో భూటాన్, కూచ్ బెహార్, జైపూర్ కు చెందిన రాజకుటుంబాలు ఉన్నట్లు సమాచారం. గతంలో సంపన్న కుటుంబాలు ఏనుగును కలిగి ఉండటం ద్వారా తమ హోదాను ప్రదర్శించేవారు. ప్రభుత్వం ఈ పద్ధతిని నిషేధించే వరకు ఇది కొనసాగేది.

అంతకు మించి, పర్బతి ఏనుగులతో బలమైన బంధాన్ని కలిగి ఉన్నందున వాటిని మచ్చిక చేసుకోవడం, వాటికి అన్నీనేర్పించడంలో ఎక్కువ సమయం గడిపింది.

బారుహ్ ఏనుగుల జీవన పరిస్థితులను మెరుగుపరిచే అనేక కార్యక్రమాలలో పాల్గొనేది. 14 ఏళ్ల వయసులో అస్సాంలోని కోచుగావ్ అడవుల్లో తన మొదటి ఏనుగును విజయవంతంగా మచ్చిక చేసుకుంది. 1975 మరియు 1978 మధ్య, ఆమె స్వతంత్రంగా ఉత్తర బెంగాల్ (జల్పైగురి మరియు డార్జిలింగ్) మరియు అస్సాం (దర్రాంగ్ మరియు కొచుగావ్) అడవుల్లో పద్నాలుగు అడవి ఏనుగులను మచ్చిక చేసుకుంది. అటవీ అధికారులకు ఏనుగుల గురించి మరింత సమాచారాన్ని బారుహ్ అందించేది. ఏనుగుల సంరక్షణలో కూడా ఆమె సహాయం చేసింది.

పద్మ అవార్డులను రిపబ్లిక్ డే సందర్భంగా గురువారం ప్రకటించారు. ఈ సంవత్సరానికి 132 పద్మ అవార్డుల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ జాబితాలో సమాజంపై విశేషమైన ప్రభావాన్ని చూపిన అనేక మంది వ్యక్తులు ఉన్నారు. 'హస్తి కన్యా' అని కూడా పిలువబడే పర్బతి బారుహ్ అనేక మంది గ్రహీతలలో ఒకరిగా నిలిచారు. అస్సామీకి చెందిన ఆమెకు ప్రస్తుతం 67 ఏళ్లు. ఆమె భారతదేశంలోనే మొదటి మహిళా ఏనుగు మావటిగా పేరు తెచ్చుకుంది. చారిత్రాత్మకంగా పురుషుల ఆధిపత్యంలో ఉన్న రంగంలో మహిళలకు పేరు తెచ్చేలా జంతు సంరక్షణలో ఆమె చేసిన కృషికి పద్మశ్రీ అవార్డు లభించింది.

ఈ జాబితాలో 5 పద్మ విభూషణ్, 17 పద్మ భూషణ్, 110 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డు గ్రహీతలలో 30 మంది మహిళలు, విదేశీయులు 8 మంది, 9 మంది మరణానంతర అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story