Operation Sindoor : పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై అటు చర్చ.. ఇటు ఎన్‌కౌంటర్
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకొన్న ఉగ్రవాదుల్లో ఇద్దరిని భారత సైన్యం సోమవారం మట్టుబెట్టింది. భద్రతాదళాలు ఎంతో చాకచక్యంగా జరిపిన ఈ కాల్పుల్లో పహల్గాం ఉగ్రదాడి మాస్టర్‌మైండ్, లష్కరే తాయిబా టాప్ కమాండర్ సులేమాన్ షా అలియాస్ మూసాఫౌజీ, పహల్గాం దాడికి కారణమైన మరో ఉగ్రవాది యాసిర్‌తో పాటు మరో ఉగ్రవాది అబూ హామ్‌జా హతమయ్యాడు. ఈ మేరకు ఆల్ ఇండియా రేడియో వెబ్‌సైట్‌లో వెల్లడించింది. సైన్యం ధ్రువీకరించినట్టు తెలిపింది.
నెల నుంచి జల్లెడ పట్టి..
జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ సమీపంలో ఉన్న హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో గడిచిన నెలరోజులుగా ఆ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. లష్కరే, జైషే ఉగ్రవాదుల కదలికల కోసం గడిచిన 14 రోజులుగా మరింత ముమ్మరంగా నిఘాను పెంచాయి. ఈ క్రమంలో దాచిగామ్ నేషనల్ పార్క్ పరిసరాల్లో రెండు రోజుల కిందట అనుమానస్పద కమ్యూనికేషన్లను భారత సైన్యం పసిగట్టింది. దీనికి తోడు ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని స్థానిక ప్రజలు సైన్యానికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన సైన్యం.. 24 రాష్ట్రీయ రైఫిల్స్, 4 పారా కమాండోల బృందం సోమవారం ఉదయం నిర్ణీత ప్రాంతానికి చేరుకొన్నాయి.
మెరుపు వేగంతో కాల్పులు
సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో దాచిగామ్ నేషనల్ పార్క్ పరిసరాల్లో ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించిన భద్రతాదళాలు.. మెరుపు వేగంతో కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఉగ్రవాది సులేమాన్ షాతో పాటు పహల్గాం దాడికి కారణమైన మరో ఉగ్రవాది యాసిర్ హతమైనట్టు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో మరో ఉగ్రవాది అబూ హామ్‌జా కూడా హతమైనట్టు పేర్కొన్నారు. వీరందరూ విదేశీ ఉగ్రవాదులేనని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్ముకశ్మీర్ పోలీసులు పాలుపంచుకొన్నట్టు పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ అనంతరం జరిపిన సోదాల్లో 17 గ్రెనెడ్లు, ఒక ఎం4 కార్బైన్, రెండు ఏకే 47 రైఫిల్స్‌ను భద్రతాదళాలు స్వాధీనం చేసుకొన్నాయి.
మరోవైపు ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి లోక్‌సభలో సోమవారం ఉదయం చర్చ జరగాల్సిన తరుణంలో అనూహ్యంగా బీహార్ ఓటరు జాబితా సవరణ అంశాన్ని కాంగ్రెస్ తెరమీదకు తీసుకొచ్చింది. దానిపై చర్చకు పట్టుబట్టింది. ప్రతిపక్ష సభ్యుల నిరసనలతో లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. వాయిదా పడిన ఈ రెండు గంటల వ్యవధిలోనే అనూహ్య పరిణామం చోటుచేసుకొన్నది. ‘ఆపరేషన్ మహదేవ్’ పేరిట జమ్ముకశ్మీర్‌లో భద్రతాదళాలు పహల్గాం దాడికి కారణమైన ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ వార్త దావానలంలా దేశమంతా వ్యాపించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com