PUBG Love: ఇకపై భారతదేశమే నా ఇల్లు.. పాక్ కు వెళ్లనంటే వెళ్లను

నువ్వా దరిని, నేనీ దరిని కృష్ణమ్మ కలిపి ఇద్దరినీ.. ఇది పాత.. ఇప్పుడు కొత్త పాట PUBG కలిపింది ఇద్దరినీ.. ఆమె పాకిస్థాన్ లో ఉంటే, అతడు ఇండియాలో ఉన్నాడు.. ఇద్దరూ పబ్ జీ ఆడుతూ కబుర్లెన్నో చెప్పుకున్నారు.. ఇక దూరంగా ఉండడం కష్టమనుకున్నారు.. ఇద్దరం ఒక్కదగ్గరే ఉండి కలిసి ఆడుకుందామనుకున్నారు.. అంతే ఎవరికీ చెప్పాపెట్టకుండా రహస్యంగా ఇండియా వచ్చేసింది పాక్ మహిళ. నలుగురు పిల్లలున్నా ఏ మాత్రం జంకు లేకుండా ప్రేమికుడి కోసం వాళ్లని కూడా తీసుకుని వచ్చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో తన ప్రేమికుడు సచిన్‌తో కలిసి ఉండటానికి తన నలుగురు పిల్లలతో అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించినందుకు సీమా హైదరీని పోలీసులు అరెస్ట్ చేశారు. తాను భారతీయ సంస్కృతిని హృదయపూర్వకంగా స్వీకరించానని సీమ చెబుతోంది. 2019లో PUBG గేమ్ ఆడుతూ ప్రేమలో పడింది. తన ప్రేమికుడితో కలిసి ఉండటానికి, హైదర్ అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించింది. సీమ తన ప్రియుడు, పిల్లలతో కలిసి గ్రేటర్ నోయిడాలోని రబుపురా ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు.
నేపాల్ ద్వారా వీసా లేకుండా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించినందుకు జూలై 4న ఆమెను అరెస్టు చేశారు. ఆమెకు సహాయం చేసినందుకు సచిన్‌ను కూడా అరెస్టు చేశారు. శుక్రవారం ఇద్దరికి బెయిల్ మంజూరైంది. మీడియాతో మాట్లాడుతూ, సీమా హైదర్ తన దినచర్యలో భాగంగా ఇప్పుడు తన మెడలో రాధే-రాధే పట్టీని ధరించడం, ఎవరైనా ఎదురుపడితే నమస్కరిస్తూ పలకరించడం, ఆశీర్వాదం కోసం పెద్దల పాదాలను, దేవుణ్ణి ప్రార్థించడం వంటివి ఉన్నాయని చెప్పారు. తాను హిందూ మతాన్ని స్వీకరించానని, వెల్లుల్లిని తినని సచిన్ కుటుంబంలా శాకాహార జీవనశైలిని అవలంబించానని చెప్పింది. పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లాలని లేదని, వెళితే తనని బతకనివ్వరని ,చంపేస్తారని తెలిపింది.
ఆమె పిల్లలకు పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, వారు ఆమెతోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. తన మొదటి భర్త గులామ్ 2020 నుండి తన నుంచి దూరంగా ఉన్నాడని సీమా పేర్కొంది. సీమ, సచిన్‌ల సంబంధం చిగురించిన సమయంలో, గులాం పని నిమిత్తం సౌదీ అరేబియాలో ఉన్నాడు. గులాం తనను మానసికంగా, శారీరకంగా హింసించేవాడని తెలిపింది. అతడి నుంచి విముక్తి దొరికినందుకు సంతోషంగా ఉందని వివరించింది. సచిన్‌పై తనకున్న అపారమైన ప్రేమను వ్యక్తపరిచింది. ఇప్పుడు ఇతడే తన భర్త అని, ఇతనితో తాను చాలా సంతోషంగా ఉన్నానని సీమ తెలిపింది. పిల్లలు కూడా సచిన్‌ను తమ తండ్రిగా భావిస్తున్నారని ఆమె చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com