Pakistan: సొంత ప్రజలపైనే కుప్పకూలిన పాకిస్తాన్ క్షిపణి..

భారత దేశానికి ఏ మాత్రం తీసుపోము, చెప్పాలంటే భారత్ కన్నా మేమే గొప్ప అని ప్రగల్భాలు పలికే పాకిస్తాన్ తీరు నవ్వులపాలవుతూనే ఉంది. తాజాగా, పాకిస్తాన్ పరీక్షించిన ఒక క్షిపణి కూలిపోయింది. అణ్వాయుధాలు మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన షాషీన్-3 మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని పాకిస్తాన్ పరీక్షించింది. ఆ సమయంలోనే భారీ ప్రమాదం సంభవించింది. పాకిస్తాన్ క్షిపణి దారితప్పి, లక్ష్యాన్ని ఛేదించకుండానే బలూచిస్తాన్ ప్రావిన్సులో డేలా బుగ్టి లో పేలిపోయింది. అయితే, పరువు పోతుందని పాకిస్తాన్ మీడియా కానీ, సైనిక విభాగం కానీ ఈ ప్రమాదంపై ఎలాంటి కథనాలు, నివేదికలు ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియా, అనేక ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అకౌంట్లలో కూలిపోయిన చిత్రాలు వచ్చాయి. వార్తలు వ్యాప్తి చెందకుండా పాకిస్తాన్ ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ షట్ డౌన్ చేసింది.
జూలై 22న జరిగిన ఈ ప్రమాదం, పాకిస్తాన్ అణ్వాయుధాలకు కేంద్రంగా ఉన్న, యురేనియం ప్రాసెసింగ్ ప్లాంట్ ఉన్న డేరా ఘాజీ ఖాన్ సమీపంలో జరిగింది. స్థానికులు చెబుతున్న దాని ప్రకారం..క్షిపణి గాలిలోనే పేలిపోయినట్లు తెలుస్తోంది. దీని శిథిలాలు జనాలు ఉండే ప్రాంతాల్లో పడ్డాయి. ఆ సమయంలో భారీ పేలుడు వినిపించిందని చెబుతున్నారు. ఈ పేలుడు శబ్ధం 50 కి.మీ దూరంలో ఉన్న వారికి కూడా వినిపించినట్లు తెలుస్తోంది. సైన్యం వెంటనే ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ బ్లాక్ చేసింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్‌లో ఆతర్వాత వైరల్ అయ్యాయి. గతంలో కూడా పలుమార్లు షాహీన్ క్షిపణి విఫలమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com