Golden Temple: స్వర్ణ దేవాలయాన్ని టార్గెట్ చేసిన పాక్..

పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మే 7వ తేదీన పాక్లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను మిస్సైళ్లతో ధ్వంసం చేసింది. అయితే, ఆ తర్వాత పాక్ పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో గల స్వర్ణ దేవాలయాన్ని టార్గెట్గా చేసుకుని డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడికి ప్రయత్నించింది అని GOC మేజర్ జనరల్ కార్తీక్ సి శేషాద్రి ఈ రోజు మీడియాకు తెలిపారు. ఇక, గోల్డెన్ టెంపుల్ ని లక్ష్యంగా చేసుకున్న అన్ని డ్రోన్‌లు, క్షిపణులను ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు వెల్లడించారు. ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన దాడులతో ఉక్కిరిబిక్కిరైన పాక్ మన దేశంలోని సైనిక స్థావరాలు, నివాస ప్రాంతాలు, ప్రార్థనా మందిరాలపై దాడి చేసేందుకు ప్లాన్ చేస్తుందని ముందుగానే ఊహించింది భారత సైన్యం. దీంతో స్వర్ణ దేవాలయం పరిసరాల్లో పూర్తిస్థాయి వైమానిక రక్షణ కల్పించినట్లు తెలిపారు.
అలాగే, మే 8వ తేదీన పాకిస్తాన్ మానవ రహిత వైమానిక దాడులు చేపట్టిందని మేజర్ జనరల్ కార్తీక్ సి శేషాద్రి పేర్కొన్నారు. ప్రధానంగా డ్రోన్లు, దీర్ఘ-శ్రేణి క్షిపణులతో దాడులకు పాల్పడినట్లు చెప్పుకొచ్చారు. ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, L-70 ఎయిర్ డిఫెన్స్ గన్స్ లాంటి భారత వైమానిక రక్షణ వ్యవస్థలు అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని, పంజాబ్ లోని నగరాలను పాక్ దాడుల నుంచి కాపాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆపరేషన్ సింధూర్ తో సాయుధ దళాలు పాక్ లోని అనేక ప్రదేశాలను అత్యంత కచ్చితత్వంతో దాడి చేసి నాశనం చేశారని వెల్లడించారు. ఉగ్రవాద సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్న మురిద్కే, బహవల్పూర్ వంటి ప్రాంతాలపై దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేసినట్లు మేజర్ జనరల్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com