Pakistan Woman: న్యాయం కావాలంటూ ప్రధాని మోదీకి పాకిప్థాన్ మహిళ విన్నపం

తన భర్త తనను పాకిస్థాన్‌లో వదిలేసి, రహస్యంగా ఢిల్లీలో మరో పెళ్లికి సిద్ధమవుతున్నాడని ఓ పాకిస్థానీ మహిళ ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. కరాచీకి చెందిన నికితా నాగ్‌దేవ్ అనే మహిళ, తన భర్త విక్రమ్ నాగ్‌దేవ్‌పై ఈ తీవ్ర ఆరోపణలు చేశారు.
నికితా కథనం ప్రకారం, ఇండోర్‌లో దీర్ఘకాలిక వీసాపై నివసిస్తున్న పాకిస్థాన్ మూలాలున్న విక్రమ్ నాగ్‌దేవ్‌తో ఆమెకు 2020 జనవరి 26న కరాచీలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. పెళ్లైన నెల తర్వాత, ఫిబ్రవరి 26న ఆమెను భారత్‌కు తీసుకొచ్చారు. అయితే, కొన్ని నెలలకే 'వీసాలో సాంకేతిక సమస్య' ఉందని చెప్పి, 2020 జూలై 9న అటారీ సరిహద్దు వద్ద తనను బలవంతంగా పాకిస్థాన్‌కు పంపించేశాడని ఆమె ఆరోపించారు. అప్పటి నుంచి తనను తిరిగి భారత్‌కు పిలిపించుకోవడానికి విక్రమ్ నిరాకరిస్తున్నాడని ఆమె వాపోయారు.
పెళ్లై అత్తారింటికి వచ్చిన కొద్ది రోజులకే వారి ప్రవర్తనలో మార్పు వచ్చిందని నికిత తెలిపారు. తన భర్తకు తన బంధువుల్లో ఒకరితో వివాహేతర సంబంధం ఉందని తెలిసిందని, ఈ విషయం మామగారికి చెబితే, 'అబ్బాయిలకు ఇలాంటివి సహజం, ఏమీ చేయలేం' అని అన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "ఈ రోజు నాకు న్యాయం జరగకపోతే, న్యాయవ్యవస్థపై మహిళలకు నమ్మకం పోతుంది. దయచేసి నాకు అండగా నిలవండి" అని ఆమె కరాచీ నుంచి విడుదల చేసిన వీడియోలో వేడుకున్నారు.
తన భర్త ఢిల్లీకి చెందిన మరో మహిళను పెళ్లి చేసుకోబోతున్నాడని తెలియడంతో నికిత 2025 జనవరి 27న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ కేసు మధ్యప్రదేశ్ హైకోర్టుచే అధికారం పొందిన సింధీ పంచ్ మధ్యవర్తిత్వ, న్యాయ సలహా కేంద్రం ముందుకు వచ్చింది. విచారణ అనంతరం మధ్యవర్తిత్వం విఫలమైంది. భార్యాభర్తలిద్దరూ భారత పౌరులు కానందున, ఈ కేసు పాకిస్థాన్ పరిధిలోకి వస్తుందని పేర్కొంటూ, విక్రమ్‌ను పాకిస్థాన్‌కు బహిష్కరించాలని ఆ కేంద్రం 2025 ఏప్రిల్ 30న సిఫార్సు చేసింది.
గతంలో 2025 మే నెలలో ఇండోర్ సోషల్ పంచాయితీ కూడా విక్రమ్‌ను దేశం విడిచి పంపాలని సిఫార్సు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో, ఇండోర్ కలెక్టర్ ఆశిష్ సింగ్ ఈ విషయంపై విచారణకు ఆదేశించినట్లు ధృవీకరించారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

