SIR: దేశ వ్యాప్తంగా ‘‘SIR’’ అమలుకు ఎన్నికల సంఘం కసరత్తు..!

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలను సమగ్రంగా సవరించే దిశగా భారత ఎన్నికల సంఘం (ఈసీ) కీలక అడుగులు వేస్తోంది. ఈ ప్రక్రియపై చర్చించి, ఒక స్పష్టమైన కార్యాచరణ రూపొందించేందుకు ఈ నెల 10న ఢిల్లీలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులతో (సీఈఓలు) ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనుంది.
ఈ సమావేశంలోనే "ఓటరు సమగ్ర సవరణ" (సర్) ప్రక్రియను దేశమంతా విస్తరింపజేయడంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సమావేశానికి హాజరయ్యే సీఈఓలు తమ తమ ప్రాంతాల్లోని ఓటర్ల సంఖ్య, చివరిసారిగా ‘సర్’ ఎప్పుడు నిర్వహించారు అనే వివరాలతో పాటు మొత్తం పది కీలక అంశాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌తో సిద్ధంగా రావాలని ఈసీ ఆదేశించినట్లు సమాచారం. ఈ ఆదేశాలను బట్టి ఓటర్ల జాబితా సవరణ అంశానికే ఈసీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ బృహత్కర కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టాలని ఎన్నికల సంఘం యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, ఈసీ ఇప్పటివరకు దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఓ జాతీయ మీడియా ఛానల్, ఎన్నికల సంఘం వర్గాలను ఉటంకిస్తూ ఈ వార్తను ప్రసారం చేసింది. ఈ నెల 10న జరగబోయే సమావేశం తర్వాత ఓటర్ల జాబితా సవరణపై ఈసీ అనుసరించబోయే వ్యూహంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com