PM Modi: నీట్ ఇష్యూ, పేపర్ లీకులపై లోక్‌సభలో స్పందించిన ప్రధాని మోడీ..

లోక్‌సభలో మంగళవారం ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎంపీల నినాదాలతో సభ హోరెత్తింది. దీంతో నినాదాల మధ్యే ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించాల్సి వచ్చింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మోదీ ప్రసంగించారు.
నీట్ సమస్య, పేపర్ లీకులపై ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభలో స్పందించారు. దేశంలో ఇలాంటి ఘటనలు నివారించేందుకు ప్రభుత్వం సీరియస్‌గా ఉందని ప్రతీ విద్యార్థికి, దేశంలో ప్రతీ యువకుడికి చెబుతున్నానని భరోసా ఇచ్చారు. యువత భవిష్యత్తుతో ఆటలాడే వారిని వదిలిపెట్టబోమని, నీట్‌కి సంబంధించి దేశవ్యాప్తంగా అరెస్టులు జరుగుతున్నాయని అన్నారు. మంగళవారం లోక్‌సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన నీట్-యూజీ పేపర్ లీక్‌పై తీవ్ర విచారం వ్యక్తం చేశానని, పేపర్ లీక్‌కు కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని విద్యార్థులకు హామీ ఇచ్చారు.పేపర్ లీక్‌లను అరికట్టేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నదని, యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న వారిని వదిలిపెట్టబోమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
మరోవైపు కాంగ్రెస్, రాహుల్ గాంధీపై ప్రధాని విరుచుకుపడ్డారు. పిల్లాడి మనస్తత్వానికి జ్ఞానోదయం కలుగుతుందని ఆశిస్తున్నట్లు పరోక్షంగా సెటైర్లు వేశారు. వారికి బుద్ధి ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు నిండాయని, ఆ సమయంలో అధికారంలో ఉన్న వ్యక్తుల మనస్తత్వం అన్ని హద్దులు దాటిందని, ప్రభుత్వాలను పగగొట్టడం, మీడియాను అణిచివేడయం, ప్రతిదీ రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా జరిగిందని అన్నారు. దేశంలో దళితులు, వెనకబడిన వారికి కాంగ్రెస్ అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. హిందూ సంస్కృతిని తిట్టడం ప్రతిపక్షానికి అలవాటుగా మారిందని, ‘హిందూ ఉగ్రవాదం’ అని పదాలను కాంగ్రెస్ పలికిందని, ఆ పార్టీ మిత్రపక్షాలు హిందుత్వాన్ని మలేరియాతో పోల్చాయని, దేశం వారిని ఎన్నటికీ క్షమించదని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com