Supreme Court: కోచింగ్ సెంటర్లను కట్టడి చేయలేం : సుప్రీం కోర్టు

Supreme Court: కోచింగ్ సెంటర్లను కట్టడి చేయలేం  : సుప్రీం కోర్టు
విద్యార్థుల ఆత్మహత్యలకు తీవ్ర పోటీ, తల్లిదండ్రుల ఒత్తిడే కారణం

విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దేశంలో ప్రతిరోజూ ఏదో ఒక చోట విద్యార్థుల బలవన్మరణాలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో సుమారు 8.2 శాతం మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తేలింది. దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు విద్యార్థుల ఆత్మహత్యలు ఎంతటి సీరియస్‌ అంశమో. ఇదిలా ఉంటే తాజాగా సుప్రీం కోర్ట్‌ విద్యార్థుల బలవన్మరణంపై సంచనల వ్యాఖ్యలు చేసింది. కోచింగ్ సెంటర్లకు కేంద్రమైన రాజస్థాన్‌లోని కోటాలో పెరిగిపోతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రుల ఆశలు, అంచనాలే విద్యార్థులను బలవన్మరణానికి పురిగొల్పుతున్నాయని తేల్చి చెప్పింది. కోచింగ్ సెంటర్లను తప్పుబట్టలేమని వ్యాఖ్యానించింది.

మెడికల్, ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్టులకు విద్యార్థులను సన్నద్ధం చేసే ప్రైవేటు సెంటర్ల తీరుతో విద్యార్థులను ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ ముంబైకి చెందిన ఓ వైద్యుడు సుప్రీంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కోచింగ్ సెంటర్లను నియంత్రించేందుకు దేశంలో చట్టం ఏదీ లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోచింగ్ సెంటర్లు విద్యార్థులను లాభాలు తెచ్చే వస్తువులుగా చూస్తున్నాయని పేర్కొన్నారు.

కోచింగ్ సెంటర్లను నియంత్రించడం తేలికైన విషయం కాదన్న సుప్రీం కోర్ట్‌.. ఇటువంటి సంఘటనలన్నింటి వెనక తల్లిదండ్రుల ఒత్తిడే అధికంగా ఉంటుందని అభిప్రాయపడింది. కోచింగ్‌ సెంటర్లు ఉండకూడదని చాలామంది కోరుకుంటారు. కానీ, పాఠశాలల్లో పరిస్థితులు, అక్కడ తీవ్రమైన పోటీ.. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు ఈ కోచింగ్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా తెలిపారు. పిటిషనర్‌ ధర్మాసం ఈ పరిస్థితిపై తమకూ అవగాహన ఉందని, అయినప్పటికీ ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వాన్ని సంప్రదించాలని పిటిషనర్‌కు సూచించింది.

అయితే, పిటిషన్‌లో ఎక్కువగా రాజస్థాన్‌లోని ఘటనలనే పేర్కొన్నందుకు పిటిషనర్ ముందుగా అక్కడి హైకోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యకు కోచింగ్ సెంటర్లను బాధ్యులను చేయకూడదని అభిప్రాయపడింది. ‘‘మనలో చాలా మంది కోచింగ్ సెంటర్లు వద్దనే అనుకుంటున్నారు. కానీ, ఈ చదువుల్లో పోటీ పెరిగిపోయింది. ఒక మార్కు, అర మార్కు తేడాతో విద్యార్థులు సీటు కోల్పోతున్నారు. తల్లిదండ్రులకు తమ పిల్లలపై చాలా ఆశలు, అంచనాలు ఉంటున్నాయి’’ అని న్యాయస్థానం పేర్కొంది. ఈ అంశంపై చట్టం తేవాలని తాము సూచించలేమని తేల్చి చెప్పింది. రాజస్థాన్ హైకోర్టు లేదా కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది.

Tags

Next Story