Parliament breach: పార్లమెంట్‌లో దాడి స్మోక్ డబ్బాలతో దాడి చేసిన నిందితులకు బెయిల్..

డిసెంబర్ 13, 2023న జరిగిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో అరెస్టయిన నీలం ఆజాద్,మహేష్ కుమావత్‌లకు ఢిల్లీ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు నిందితులు ఒక్కొక్కరూ రూ. 50,000 బెయిల్ బాండ్, అంతే మొత్తంలో ఇద్దరు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది. బెయిల్ షరతుల్లో భాగంగా నిందితులు ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదా కేసుకు సంబంధించిన ఏదైనా బహిరంగ ప్రకటన చేయకుండా కోర్టు నిషేధించింది. సంఘటనకు సంబంధించి సోషల్ మీడియా పోస్టులు చేయవద్దని హెచ్చరించింది. ఇంతే కాకుండా నిందితులు ఢిల్లీ నగరం విడిచి వెళ్లకుండా కోర్టు ఆంక్షలు విధించింది. ప్రతీ సోమ, బుధ, శుక్రవారాల్లో ఉదయం 10 గంటలకు నిర్ణీత పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశించింది.
డిసెంబర్ 13, 2023లో ఆరుగురు వ్యక్తులు పార్లమెంట్ సెక్యూరిటీని దాటుకుని, పార్లమెంట్ హాలులోకి ప్రవేశించారు. జీరో అవర్ సమయంలో వారు పబ్లిక్ గ్యాలరీల నుంచి దూకి, పసుపు రంగులో ఉన్న వాయువును విడుదల చేశారు. దీంతో ఒక్కసారిగా పార్లమెంట్‌లో గందరగోళం ఏర్పడింది. ఎంపీలు భయపడిపోయారు. ఆరుగురు నిందితుల్లో సాగర్ శర్మ, మనోరంజన్ డి లోక్‌సభ హాలులోకి చొరబడ్డారు.
డిసెంబర్ 13, 2001 పార్లమెంట్ ఉగ్రవాద దాడి రోజే, ఈ ఘటన జరగడంతో ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. పార్లమెంట్ లోపల ఇద్దరు నిందితులు పొగ డబ్బాలతో హల్చల్ చేయగా.. మరో ఇద్దరు పార్లమెంట్ వెలుపల హంగామా చేశారు. వివిధ అంశాలపై ప్రభుత్వం దృష్టిని ఆకర్షించే లక్ష్యంతో ఈ ఉల్లంఘన జరిగిందని నిందితులు విచారణ సందర్భంగా పోలీసులకు తెలిపారు. నిరుద్యోగం, రైతు సమస్యలు, మణిపూర్ హింసపై తాము కలత చెందామని నలుగురు నిందితులు పోలీసులకు చెప్పారు. ఈ విషయాలపై చట్టసభ సభ్యలు చర్చించడానికి వారి దృష్టిని ఆకర్షించేందుకు రంగు పొగను ఉపయోగించామని విచారణలో వెల్లడించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com