Parliament Sessions : నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు

Parliament Sessions : నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు
ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి

సార్వత్రిక ఎన్నికల ముందు చివరి పార్లమెంటు సమావేశాలు నేటి నుంచి జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఎన్నికల నేపథ్యంలో. కేంద్రం ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. కొత్త పార్లమెంట్ భవనంలో మొదటిసారి ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. గత సెషన్ ల ఉభయసభల్లో 146మందిపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయనున్నారు.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రతి అంశాన్ని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి 30 పార్టీల నుంచి 45 మంది హాజరయ్యారు. 17వ లోక్ సభకు ఇవే చివరి సమావేశాలు కనుక ప్లకార్డులు తీసుకురావద్దని అన్ని పార్టీలను కోరినట్లు జోషి వివరించారు. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్ముకశ్మీర్‌ బడ్జెట్‌ను కూడా సీతారామన్‌ పార్లమెంట్‌ ప్రవేశపెడుతారని చెప్పారు. ఈ సమావేశాల ఎజెండాలో రాష్ట్రపతి ప్రసంగం, తాత్కాలిక బడ్జెట్‌ ప్రతిపాదన, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఉంటాయని వివరించారు.

ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలు పలు అంశాలను లేవనెత్తారు. నిరుద్యోగం, అధిక ద్రవ్యోల్బణం, వ్యవసాయరంగ సంక్షోభం, మణిపూర్‌లో హింస అంశాలను సభలో లేవనెత్తుతామని చెప్పారు. ప్రార్థనా స్థలాల చట్టాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ నేత ఎస్‌టీ హసన్‌ డిమాండ్‌ చేశారు.

ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం 1947, ఆగస్టు 15 నాటికి ఆయా మతాల వారి స్వాధీనంలో ఉన్న ప్రార్థనా స్థలాలను యథాతథంగా కొనసాగించాలని, వారణాసిలోని జ్ఞానవాపి మసీదును హిందువులకు అప్పగించాలన్న వాదన ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో హసన్‌ ఈ డిమాండ్‌ చేశారు. వీటిపై ప్రహ్లాద్‌ జోషీ స్పందిస్తూ.. అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. ఇక ఈ సమావేశాల్లో ఇండియా పేరును భారత్‌గా మార్చడం, వన్ నేషన్-వన్ ఎలక్షన్, ఉమ్మడి పౌరస్మృతి బిల్లుల్ని ప్రవేశపెడతారనే ప్రచారం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ధృవీకరించకపోడవంతో సందిగ్దత నెలకొంది. ఈ బిల్లుల్ని మోదీ ప్రభుత్వం హఠాత్తుగా ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని, లేకపోతే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాల్సిన అవసరమేముందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story