Parliament: నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్రంలో ఎన్డీయే సర్కారు మూడోసారి కొలువుదీరిన తర్వాత తొలిసారి ఈరోజు బడ్జెట్‌ను సమర్పించేందుకు సిద్ధం అయ్యింది. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. మంగళవారం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ప్రభుత్వం ఆరు బిల్లులను సభామోదం కోసం తీసుకురానుంది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, రైల్వే భద్రత, కావడి (కన్వర్) యాత్ర మార్గంలో హోటళ్లపై యజమానుల పేర్లు రాయాలనే నిబంధన వంటి అంశాలపై కేంద్రాన్ని ఐక్యంగా నిలదీయాలని విపక్షం భావిస్తోంది. సంప్రదాయాన్ని అనుసరించి డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించాలని ఆదివారం నాటి అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బడ్జెట్ సమావేశాల కార్యాచరణపై చర్చించేందుకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ప్రభుత్వం దీనిని నిర్వహించింది.
ఒక్కో సభ్యుడు ఉన్న పార్టీలు సహా ఈసారి అందరినీ అఖిలపక్షానికి ఆహ్వానించారు. 44 పార్టీల నుంచి 55 మంది నేతలు హాజరై డిమాండ్లు వినిపించారు. పార్లమెంట్‌లో తమకు గొంతు వినిపించే అవకాశం ఇస్తామన్న భరోసా కల్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్, బిహార్, ఒడిశాలకు ప్రత్యేక హోదా కల్పించాలని వైకాపా, జేడీయూ, బిజద నేతలు డిమాండ్ చేశారు. ‘కావడి యాత్ర’ అంశాన్ని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్‌గోపాల్ యాదవ్ ప్రస్తావించారు. కీలకమైన 24 శాఖలకు సంబంధించి స్టాయీ సంఘాలను ఏర్పాటు చేయాలని, వాటికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. మంత్రులతో ఎంపీలు నేరుగా చర్చించేందుకు వీలుగా సంప్రదింపుల కమిటీలను పునరుద్ధరించాలన్నారు. ఇంటర్నెట్‌ను ప్రజలందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలనే ప్రైవేటు మెంబర్ బిల్లును పరిగణనలో తీసుకునేందుకు ప్రభుత్వం ఆమోదించింది. దీంతోపాటు ఉన్నత న్యాయస్థానాల విశ్రాంత న్యాయమూర్తులు రాజకీయాల్లోకి రావడం, కృత్రిమ మేధ, డీప్‌ఫేక్, పౌరసత్వ సవరణ చట్టంపైనా ఇలాంటి 23 బిల్లుల్ని రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. సమావేశానంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడారు. ఎలాంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అఖిలపక్ష సమావేశం జరుగుతుండగా వివరాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్న జైరాం రమేశ్‌ను భాజపా ఐటీ విభాగాధిపతి మాలవీయ తప్పుబట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com