Parliament Budget Session : నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారం ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. పార్లమెంట్ సమావేశాలను పురస్కరించుకొని ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా వివిధ విపక్షాలకు చెందిన నేతలు మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం పునరుద్ధరణ, ఓటర్ల జాబితాను సవరించేందుకు చేపట్టిన ‘సర్’ ప్రక్రియ, భారత విదేశాంగ విధానం, వివాదాస్పదమైన యూజీసీ కొత్త మార్గదర్శకాలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌ను, సర్‌పై విస్తృత చర్చను ప్రభుత్వం తోసిపుచ్చింది.
కేంద్ర బడ్జెట్ 2026-27 రూపకల్పన ప్రక్రియ చివరి ఘట్టానికి సూచనగా నిర్వహించే సంప్రదాయ 'హల్వా వేడుక' మంగళవారం నాడు ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో ఉన్న బడ్జెట్ ప్రెస్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి హాజరయ్యారు. బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ ముగింసిందని, ఇక ప్రింటింగ్ ప్రారంభమవుతుందని ఈ వేడుక సంకేతాన్నిస్తుంది.
ఈ వేడుక ముగిసిన వెంటనే బడ్జెట్ రూపకల్పనలో పాలుపంచుకున్న కీలక అధికారులు 'లాక్-ఇన్' పీరియడ్‌లోకి వెళతారు. ఫిబ్రవరి 1న పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే వరకు వీరంతా బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేకుండా పూర్తి ఏకాంతంగా గడుపుతారు. ఫోన్, ఇంటర్నెట్ వంటి సదుపాయాలకు కూడా దూరంగా ఉంటారు. బడ్జెట్‌కు సంబంధించిన అత్యంత కీలకమైన, రహస్య సమాచారం బయటకు పొక్కకుండా ఉండేందుకు దశాబ్దాలుగా ఈ కఠిన నిబంధనను పాటిస్తున్నారు.
హల్వా వేడుక అనంతరం నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రెస్‌ను సందర్శించారు. అక్కడ బడ్జెట్ పత్రాల ముద్రణకు సంబంధించిన తుది ఏర్పాట్లను సమీక్షించారు. బడ్జెట్ రూపకల్పన, ముద్రణ పనుల్లో నిమగ్నమైన సిబ్బందికి, అధికారుల బృందానికి ఆమె ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ విభాగాల కార్యదర్శులు, బడ్జెట్ తయారీ ప్రక్రియతో సంబంధం ఉన్న ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
డిజిటల్ రూపంలో బడ్జెట్ పత్రాలు
గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్న విధానాన్ని కొనసాగిస్తూ, ఈసారి కూడా బడ్జెట్ పత్రాలన్నీ ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేందుకు డిజిటల్ రూపంలో విడుదల చేయనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వార్షిక ఆర్థిక నివేదిక (బడ్జెట్), పద్దుల కేటాయింపులు (డిమాండ్ ఫర్ గ్రాంట్స్), ఆర్థిక బిల్లు వంటి కీలక పత్రాలన్నీ 'యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్' ద్వారా లభిస్తాయి.
పార్లమెంటు సభ్యులు, సాధారణ ప్రజలు ఈ యాప్ ద్వారా బడ్జెట్ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఈ యాప్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లపై అందుబాటులో ఉంది. అలాగే, indiabudget.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా పత్రాలను యాక్సెస్ చేయవచ్చు. అయితే, ఫిబ్రవరి 1న పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాతే ఈ పత్రాలు యాప్‌లో, వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
