Parliament Monsoon Sessions: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ రోజు (జూలై 21) నుండి మొదలు కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 21 వరకు నెల రోజుల పాటు కొనసాగనుంది. అయితే, మొదటి రోజు నుంచే సెషన్‌లో నుండే పలు సమాసాలు చర్చలోకి వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా విపక్షాలు మోదీ ప్రభుత్వం తలపెట్టిన అంశాలపై గట్టిగా నిలదీసేందుకు వ్యూహాత్మకంగా సిద్ధమయ్యాయి. ఇండియా కూటమిలోని 24 పార్టీల ముఖ్య నేతలు సమావేశమై ప్రధాన సమస్యలపై చర్చించి వ్యూహం చేశారు. ఇక మొదటి రోజు కార్యక్రమాల విషయానికి వస్తే..
ఉదయం 10:15 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ సంప్రదాయ ప్రకటన చేస్తారు. ఆ తర్వాత లోక్‌సభలో ఆదాయపు పన్ను బిల్లుపై ప్రత్యేక కమిటీ తన నివేదికను సమర్పించనుంది. ఇందులో భాగంగా స్పీకర్ చాంబర్‌లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీ కానుంది. అయితే, సమాచారం మేరకు జస్టిస్ వర్మపై మహాభియోగ ప్రక్రియ ప్రారంభంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇంకా గత 3 నెలల్లో మరణించిన 7 మంది ఎంపీలు, మాజీ ఎంపీలకు నివాళులర్పించనున్నారు. అలాగే విపక్షాల తరఫున పహల్గాం ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సింధూర్, ట్రంప్ వ్యాఖ్యలు, బీహార్ లో SIR అంశాలపై గొడవకు సిద్ధమయినట్లు సమాచారం.
ఈ వర్షాకాల సమావేశాలలో పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్‌ను ఆపడం, బీహార్‌లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్ (SIR), అహ్మదాబాద్ విమాన ప్రమాదం, డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు వంటి అంశాలపై మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు విపక్షాలు రెడీ అవుతున్నాయి. అయితే, విపక్షాలు లేవనెత్తిన ప్రతి అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామనీ, ప్రత్యేకించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రభుత్వం పార్లమెంట్‌లో తగిన సమాధానం ఇస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్ నేత గౌరవ్ గోగోయ్ మాట్లాడుతూ.. ట్రంప్ సీజ్‌ఫైర్ వ్యాఖ్యలపై, పహల్గాం దాడికి కారణమైన లోపాలపై, బీహార్ SIRలో అవకతవకలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పార్లమెంట్‌లో ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com