Parliament Monsoon Session: రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం..

రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. రేపటి (జూలై 21) నుంచి వచ్చే నెల ఆగస్టు 21 వరకు మొత్తం 21 రోజుల పాటు “పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు” సాగనున్నాయి. ఆగస్టు 12 నుంచి 18 వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలకు శెలవు. మొత్తం ఏడు పెండింగ్ బిల్లుల తో పాటు, కొత్తగా మరో ఎనిమిది బిల్లులను ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. కొత్తగా గౌహతిలో ఐఐఎమ్ ఉన్నత విద్యాసంస్థను నెలకొల్పేందుకు గాను, “ది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ సవరణ బిల్లు”, జాతీయ క్రీడల బిల్లు, యాంటీ డోపింగ్ సవరణ బిల్లు, “గనులు, ఖనిజాల అభివృద్ధి, నిర్వహణ, నియంత్రణ సవరణ బిల్లు” తదితర బిల్లులను ప్రవేశపెట్టనున్నది.
అలాగే, లోకసభ, రాజ్యసభ ఆమోదం పొందాల్సిన పెండింగ్ లో ఉన్న పలు బిల్లులు ఈ సమావేశాల్లో ఆమోదం పొందే అవకాశం ఉంది. “ది ఇండియన్ పోర్ట్స్ బిల్లు”, “ది మర్చంట్ షిప్పింగ్ బిల్లు”లు లోకసభ ఆమోదం పొందాల్సి ఉంది. “ది కోస్టల్ షిప్పింగ్ బిల్లు”, “ది క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు”, “ది బిల్స్ ఆఫ్ లేడింగ్ బిల్లు” లు రాజ్య సభ ఆమోదం పొందాల్సి ఉంది. “ది ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు”. లోకసభ సెలెక్ట్ కమిటీ పరిశీలనలో ఉన్నది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com