Public Exam Bill: పబ్లిక్ ఎగ్జామ్స్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

పోటీ పరీక్షల్లో అవకతవకలను అరికట్టేందుకు రూపొందించిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 6నే ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలుపగా.. తాజాగా శుక్రవారం రాజ్యసభ ఆమోదించింది. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారికి గరిష్ఠంగా పదేండ్ల జైలు, కోటి రూపాయల దాకా జరిమానా విధించేలా ఈ బిల్లు రూపొందించారు. రాజ్యసభలో ఈ బిల్లుకు కొందరు ప్రతిపక్ష సభ్యులు సూచించిన సవరణలు తిరస్కరణకు గురయ్యాయి. అనంతరం బిల్లు ఆమోదం పొందింది.
పరీక్షల్లో జరుగుతున్న మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్లును ఫిబ్రవరి 5న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. పాఠశాల పరీక్షలు, కాలేజీల్లో ప్రవేశ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షలు, ఇలా వేటిలోనైనా సరే పేపర్ లీకేజిలు, తదితర మోసాలకు పాల్పడితే కఠినంగా శిక్షించడం కోసం ఈ బిల్లును రూపొందించింది. పరీక్షలు రాసే విద్యార్థులను ఈ బిల్లు లక్ష్యంగా చేసుకోలేదు. పరీక్షా పత్రాలను లీక్ చేయడం, ఆన్సర్ షీట్లను ట్యాంపర్ చేయడం, ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై పరీక్షల్లో మోసాలకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడే మాయగాళ్లను శిక్షించడమే లక్ష్యంగా ఇది రూపుదిద్దుకుంది. కొత్త చట్టం ద్వారా ఇలాంటి నేరాలకు పాల్పడేవారు ఇకపై గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, రూ. 1 కోటి వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది.
కొత్త చట్టం ద్వారా నిందితులు లేదా అనుమానితులకు పోలీసులు ఎలాంటి వారంట్ అవసరం లేకుండానే అరెస్టు చేయవచ్చు. ఈ చట్టంలో పొందుపర్చిన అన్ని నేరాలను కాగ్నిజబుల్, నాన్-బెయిలబుల్, నాన్-కాంపౌండబుల్‌గా పేర్కొన్నారు. అంటే ఈ నేరాలకు పాల్పడ్డవారు నేరుగా బెయిల్ పొందలేరు. అలాగే రాజీ కుదుర్చుకునే అవకాశం కూడా లేదు.
కొత్త చట్టంలో తప్పు చేసినవారిని శిక్షించడం మాత్రమే కాదు, తప్పు జరగకుండా నియంత్రించేలా జాగ్రత్తలు కూడా పొందుపరిచి ఉన్నాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో పాసై, రాష్ట్రపతి ఆమోదం కూడా పొందిన తర్వాత ఒక హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేసి పోటీ పరీక్షలను లోపభూయిష్టంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధ్యయనం జరుగుతుంది. అత్యంత భద్రతావ్యవస్థ కల్గిన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించడం, లోపరహిత ఐటీ సెక్యూరిటీ సిస్టమ్స్, పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ నిఘా, పరీక్షా కేంద్రాల డిజిటల్, ఫిజికల్ మౌలిక వసతుల విషయంలో కనీస ప్రమాణాలపై ఈ కమిటీ సిఫార్సులు చేస్తుంది. కొత్త చట్టం పరిధిలో ప్రస్తుతం 5 ప్రభుత్వ రంగ సంస్థలను చేర్చినప్పటికీ, భవిష్యత్తులో ఈ జాబితాలో మరిన్ని సంస్థలను చేర్చే వెసులుబాటు కూడా పొందుపరిచారు.
ఈ నెల 6నే ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలుపగా.. తాజాగా శుక్రవారం రాజ్యసభ ఆమోదించింది. రాజ్యసభలో ఈ బిల్లుకు కొందరు ప్రతిపక్ష సభ్యులు సూచించిన సవరణలు తిరస్కరణకు గురయ్యాయి. అనంతరం బిల్లు ఆమోదం పొందింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com