Parliament Security Breach: సీన్ రీక్రియేష‌న్‌కు ఢిల్లీ పోలీసుల ప్లాన్..

Parliament Security Breach:  సీన్ రీక్రియేష‌న్‌కు ఢిల్లీ పోలీసుల ప్లాన్..
దర్యాప్తులో సంచలనాలు!

పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం దేశాన్ని విస్మయానికి గురిచేసింది. ఈ కేసులో ఇప్పటికే సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి. కేసులో మాస్టర్‌ మైండ్‌గా భావిస్తున్న లలిత్‌ ఝాను విచారిస్తున్న పోలీసులు కీలక విషయాలు రాబడుతున్నారు. రంగు పొగ డబ్బాలను పటిష్టమైన భద్రతను దాటి లోక్‌సభలోకి ఎలా తీసుకెళ్లామో పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు.

దేశ ప్రజాస్వామ్య సౌధమైన పార్లమెంట్‌లో అలజడి రేపిన ఘటనలో.కీలక విషయాలు బహిర్గతమవుతున్నాయి. మూడంచెల భద్రతా వ్యవస్థను దాటి నిందితులు రంగు పొగ డబ్బాలను లోపలికి ఎలా తీసుకెళ్లారన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. నిందితులు వీటిని లోపలకి ఎలా తీసుకెళ్లారో పోలీసులు FIRలో పేర్కొన్నారు. నిందితులు బూట్ల కింద ఉండే సోల్‌ను కట్‌ చేసి అందులో ఈ స్మోక్‌ కేనిస్టర్లను అమర్చి లోక్‌సభ లోపలికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. నిందితులు లఖ్‌నవూలో ప్రత్యేక స్పోర్ట్స్‌ బూట్లు ముంబయిలో స్మోక్‌ క్యాన్లను కొనుగోలు చేశారు. ఇద్దరు నిందితులు స్పోర్ట్స్ షూ ఎడమ అరికాళ్ల వద్ద మందంగా ఉండే షూ సోల్‌ను కట్‌ చేశారు. అనంతరం ఆ ఖాళీలో స్మోక్‌ కెనిస్టర్లను అమర్చి మళ్లీ రబ్బర్‌ను అతికించారు. కుడి కాలు షోను కూడా కత్తిరించినా అందులో ఎలాంటి వస్తువులు లభించలేదని పోలీసులు తెలిపారు. అనంతరం చెకింగ్‌కు దొరకకుండా లోక్‌సభ విజిటర్స్‌ గ్యాలరీలోకి ప్రవేశించిన ఈ ఇద్దరు... అదును చూసుకుని లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకారు. అనంతరం షూల నుంచి రంగు పొగ డబ్బాలను బయటకు తీసి సభలో పొగ వచ్చేలా చేశారు.

లోక్‌సభలో నిందితులు వాడిన స్మోక్‌ కెనిస్టర్లను డోర్లు మూసి ఉన్న ప్రదేశాల్లో వినియోగించకూడదని వాడేముందు కళ్లజోడు గ్లౌజులు ధరించాలన్న నిబంధనలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. లోక్‌సభలో అలజడి రేపిన మనోరంజన్‌, సాగర్‌శర్మ నుంచి కరపత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. లోక్‌సభలోకి తీసుకువెళ్ళిన కరపత్రాలలో త్రివర్ణ పతాకం, హిందీ, ఇంగ్లీష్‌లో నినాదాలు ఉన్నాయని వెల్లడించారు. పార్లమెంట్‌లో అలజడి రేపిన నలుగురు నిందితులకు దిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఏడు రోజుల రిమాండ్‌ విధించింది. నిందితులు మనోరంజన్, సాగర్ శర్మ, అమోల్ ధన్‌రాజ్ శిందే, నీలం దేవిలను ముంబయి, మైసూర్, లఖ్‌నవూ తీసుకెళ్లి విచారించేందుకు అదనపు సెషన్స్ జడ్జి డాక్టర్ హర్దీప్ కౌర్ అనుమతించారు.

నిందితులు లఖ్‌నవులో ప్రత్యేక బూట్లు ముంబయిలో రంగు పొగ డబ్బాలు కొనుగోలు చేశారు. వీరిని ఆ ప్రాంతాలకు తీసుకెళ్లి కేసును సమగ్రంగా దర్యాప్తు చేయనున్నారు

Tags

Read MoreRead Less
Next Story